ప్రొఫెషనల్ అయి ఉండి గల్లీ బౌలర్ కంటే అధ్వాన్నంగా బౌలింగ్ చేస్తావా..? అర్ష్‌దీప్‌పై సన్నీ ఆగ్రహం
INDvsSL: టీమిండియా యువ పేసర్ గురువారం శ్రీలంకతో మ్యాచ్ లో లయ తప్పాడు. ఏకంగా ఐదు నోబాల్స్ వేయడంతో లంక బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ పై టీమిండియా మాజీలు మండిపడుతున్నారు.
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టీ20లలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన విమర్శలకు తావిచ్చింది. రెండు ఓవర్లలో ఐదు నో బాల్స్ వేసిన అతడు.. క్రికెట్ లో బేసిక్స్ మరిచిపోయి గల్లీ బౌలర్ కంటే అధ్వాన్నంగా ఆడాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు అర్ష్‌దీప్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. అతడు గాయం తర్వాత దేశవాళీలో ఆడితే బాగుండేదని.. అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు అనర్హుడని గౌతం గంభీర్ వాపోగా.. అర్ష్‌దీప్ ప్రొఫెషనల్ క్రికెటర్ అయి ఉండి మరీ ఇంత దారుణంగా బౌలింగ్ చేయడమేంటని భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు.
నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్ష్‌దీప్ ఓవర్ అయిపోయాక కామెంట్రీ చెబుతున్న సన్నీ..‘ప్రొఫెషనల్ క్రికెటర్ అయి ఉండీ ఇలా చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది ప్లేయర్లు బౌలింగ్ లో విఫలమైనప్పుడు కొన్ని విషయాలు మా నియంత్రణలో లేవని చెబుతున్నారు.
కానీ నోబాల్ ను బౌల్ చేయకపోవడం మీ నియంత్రణలో ఉన్న విషయమే కదా. మీరు బంతి విసిరిన తర్వాత బ్యాటర్ ఏం చేస్తాడు..? ఎటువంటి షాట్ ఆడతాడు..? అన్నది కచ్చితంగా మీ నియంత్రణలో లేనిదే. కానీ నో బాల్ మాత్రం మీ నియంత్రణలోనే ఉంటుంది.
క్రికెట్ లో కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ ను కూడా మరిచిపోకూడదు. నో బాల్ వేయకూడదనేది చాలా ప్రాథమికమైన అంశం. కానీ దానిని కూడా విస్మరిస్తే ఎలా..?..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా నిన్నటి మ్యాచ్ లో రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ వరుసగా హ్యాట్రిక్ నోబాల్స్ సంధించాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో కూడా మళ్లీ అదే తీరుగా రెండు నో బాల్స్ వేశాడు. అతడి పుణ్యమా అని భారత్ అదనంగా మరో 19 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.
మ్యాచ్ అనంతరం గంభీర్ కూడా అర్ష్‌దీప్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్ స్పందిస్తూ.. ‘‘ఏడు నోబాల్స్. ఒకసారి ఊహించుకోండి. అంటే ఒక ఓవర్ కంటే ఎక్కువ. అంటే ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 21 ఓవర్లు వేసినట్టు. క్రికెట్ లో ప్రతీ బౌలర్, బ్యాటర్ కు చేదు అనుభవాలుంటాయి. బౌలర్లు చెత్త బంతులు వేస్తారు. బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటారు. కానీ ఇది రిథమ్ కు సంబంధించిన విషయం.
గాయం తర్వాత తిరిగి జట్టుతో చేరినప్పుడు నేరుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడకూడదు. అతడు (అర్ష్‌దీప్ ను ఉద్దేశిస్తూ) ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలి. అక్కడ కొన్ని మ్యాచ్ లు ఆడి బౌలింగ్ లో మీ పాత రిథమ్ అందుకున్నాక అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలి. ఎందుకంటే టీ20 క్రికెట్ లో నోబాల్స్ అస్సలు ఆమోదయోగ్యం కాదు. అర్ష్‌దీప్ లో అదే మిస్ అయింది..’ అని అన్నాడు.