అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ.. 28 పరుగులు చేస్తే తోపు రికార్డు సొంతం
Virat Kohli: టీ20 ప్రపంచకప్ లో వరుసగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై వీరవిహారం చేసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ ఈ రికార్డును సాధించే అవకాశలున్నాయి.

ఆసియా కప్ కు ముందు విరామం తీసుకుని తిరిగి మునపటి ఫామ్ ను సంతరించుకున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అదరగొడుతున్నాడు. పాకిస్తాన్ పై 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే గాక టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆ తర్వాత నెదర్లాండ్స్ పైనా మరో హాఫ్ సెంచరీ (62 నాటౌట్) తో రాణించాడు. ఇక ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరులో తలపడబోతున్న కోహ్లీ.. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు సిద్దమవుతున్నాడు.
ఈ మ్యాచ్ లో గనక కోహ్లీ 28 పరుగులు చేస్తే ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక మాజీ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు మమేళ జయవర్దెనే పేరిట ఉంది. జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్ లో 31 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు.
ఈ రికార్డుకు కోహ్లీ 28 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ.. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలలో 23 మ్యాచ్ లు ఆడి (21 ఇన్నింగ్స్) 989 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ 11 పరుగులు చేస్తే జయవర్దెనే తర్వాత వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్ అవుతాడు. 27 పరుగులు చేస్తే జయవర్దెనే రికార్డును సమం చేస్తాడు. మరో పరుగు చేస్తే అది చరిత్రే..
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలలో కోహ్లీ సగటు 89.90 గా ఉండగా, జయవర్దెనే సగటు 39.07గానే ఉంది. 31 ఇన్నింగ్స్ లలో కోహ్లీ.. 12 హాఫ్ సెంచరీలు చేశాడు. జయవర్దెనే 6 హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయకున్నా అత్యధిక స్కోరు 87 గా ఉంది.
ఈ జాబితాలో టాప్-5లో భారత సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. కోహ్లీ తర్వాత విండీస్ వీరుడు క్రిస్ గేల్.. 33 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 965 పరుగులు చేశాడు. గేల్.. 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదాడు.
ఇక రోహిత్ ఇప్పటివరకు 35 మ్యాచ్ లలో 32 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 904 పరుగులు చేశాడు. ఈ టోర్నీలలో రోహిత్.. 9 హాఫ్ పెంచరీలు చేయడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో రోహిత్ కూడా 61 పరుగులు చేస్తే గేల్ రికార్డును అధిగమించి టాప్-3కి చేరుకుంటాడు. రోహిత్ తర్వాత.. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) 35 మ్యాచ్ లలో 34 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చి 897 పరుగులు సాధించాడు.