- Home
- Sports
- Cricket
- అందరూ నీలాగా రెండు సార్లు రిటైర్ అవ్వరు.. కోహ్లీ విషయంలో అఫ్రిదికి కౌంటర్ ఇచ్చిన అమిత్ మిశ్రా
అందరూ నీలాగా రెండు సార్లు రిటైర్ అవ్వరు.. కోహ్లీ విషయంలో అఫ్రిదికి కౌంటర్ ఇచ్చిన అమిత్ మిశ్రా
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై భారత జట్టు మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

మూడేండ్లుగా అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ చేయలేక ఇబ్బందిపడిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో శతకబాదాడు. అయితే ఈ మెగా టోర్నీకి ముందు కోహ్లీ ఫామ్ లేమితో ముప్పేట విమర్శలు ఎదుర్కున్నాడు. కానీ ఆసియా కప్ లో కోహ్లీ ఐదు మ్యాచులలో 276 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-2లో నిలిచాడు.
అయితే కోహ్లీపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. కోహ్లీ రిటైరైతే బెటరని సూచించాడు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని కోహ్లీకి సలహా ఇచ్చాడు.
పాకిస్తాన్ కు చెందిన ఓ ఛానెల్ తో మాట్లాడుతూ... ‘విరాట్ ఆడిన విధానం.. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అతడు కష్టపడిన తీరు.. కష్టాలను అధిగమించిన ఇక్కడిదాకా వచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ ఒక ఛాంపియన్. అయితే అతడు ఇప్పుడు రిటైర్మెంట్ వైపు వెళ్లే దశ వస్తుందని నేను నమ్ముతున్నాను..’ అని అన్నాడు. పరోక్షంగా కోహ్లీ ఇక రిటైరైతే మంచిదని ఉచిత సలహా ఇచ్చాడు.
అఫ్రిది ఇచ్చిన ఈ సలహాపై విరాట్, టీమిండియా ఫ్యాన్స్ తో పాటు భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా తనదైన శైలిలో స్పందించాడు. అందరూ నీకు (అఫ్రిది) మాదిరి రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించరని చురకలంటించాడు.
ట్విటర్ వేదికగా మిశ్రా... ‘డీయర్ అఫ్రిది.. కొంతమంది ఆటగాళ్లు తమ కెరీర్ లో ఒక్కసారే రిటైర్ అవుతారు. దయచేసి విరాట్ కోహ్లీని వీటన్నింటినుంచి దూరంగా ఉంచు..’ అని ట్వీట్ చేశాడు.
అఫ్రిది అంతర్జాతీయ కెరీర్ లో రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించి అబాసుపాలు అయ్యాడు. తొలుత ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ దానిని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆడి ఇక అవకాశాల్లేక రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.