తప్పు ఒప్పుకున్న ఊర్వశి రౌతేలా.. పంత్‌కు సారీ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!
Urvashi Rautela and Rishabh Pant: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి తెరపడినట్టేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలా మధ్య గతకొంతకాలంగా పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత వివాదాలు ముసురుకున్నాయి. ఈ మాజీ ప్రేమికులు (?) సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్నారు.
కానీ తాజాగా ఈ ఇద్దరి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుంది. రిషభ్ గురించి మీడియాలో ఊర్వశి చేసిన వ్యాఖ్యలు (అతడి పేరును ప్రస్తావించుకున్నా మీడియా మొత్తం ఆ క్రికెటర్ రిషభ్ పంత్ అని రాసుకొచ్చాయి) వైరల్ అవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు ఇన్స్టాగ్రామ్ లో పోటాపోటీ పోస్టులతో హాట్ టాపిక్ గా నిలిచారు.
అయితే ఇప్పుడు ఊర్వశి మనసు మార్చుకున్నట్టు తెలుస్తున్నది. రిషభ్ కు ‘సారీ’ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇన్స్టాంట్ బాలీవుడ్ అనే ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రిషభ్ కు ‘క్షమాపణలు’ చెప్పినట్టు సమాచారం.
గడిచిన నెలన్నరగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా ఆమె.. ‘నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. నేనేం చెప్పాను..? ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. సారీ. ఐయామ్ సారీ’ అని చేతులుజోడించి విన్నవించుకున్నట్టు పలు వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి.
అయితే సోషల్ మీడియాలో దీనిపైనా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఊర్వశి ఎంత రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా రిషభ్ మాత్రం నోరు జారలేదు. కొటేషన్స్ తో ఊర్వశికి కౌంటర్ ఇచ్చాడే తప్ప ఎక్కడా ఆమె పేరుపెట్టి విమర్శించలేదు. ఈ వ్యవహారంతో ఇద్దరి మధ్య పూర్తిగా చెడిందని అనుకున్నారంతా.
కానీ ఇటీవలే ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఊర్వశి కనిపించింది. మొదటి మ్యాచ్ లో రిషభ్ ను ఎంపిక చేయలేదు. రెండో మ్యాచ్ లో అతడు ఆడినా విఫలమయ్యాడు. అయితే ఇదే క్రమంలో ఊర్వశి.. పాకిస్తాన్ యువ క్రికెటర్ నసీమ్ షా తో ప్రేమలో పడ్డట్లు ఓ వీడియో వైరల్ అయింది. కానీ ఇది ఎడిటెడ్ వీడియో అని ఆమె తేల్చి చెప్పింది.
దారులన్నీ మూసుకుపోవడంతో ఇంకా బెట్టు సాగిస్తే లాభం లేదన్న ఆలోచనతోనే ఊర్వశి రూట్ మార్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి ఎంత రెచ్చగొట్టినా హద్దులు మీరకుండా ఉన్న రిషభ్ పంత్.. ఊర్వశి వేస్తున్న ఈ ‘సానుభూతి మంత్రం’కు లొంగుతాడా..? అనేది కాలమే తేల్చాలి.