- Home
- Sports
- Cricket
- ఢిల్లీకా.. గల్లీకా..? రాయుడు రాజకీయం ఎక్కడ్నుంచి..? వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నాకే ప్రకటన!
ఢిల్లీకా.. గల్లీకా..? రాయుడు రాజకీయం ఎక్కడ్నుంచి..? వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నాకే ప్రకటన!
Ambati Rayudu: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్, సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. త్వరలోనే అతడు అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లో పాల్గొననున్నాడు. ఇది ముగిసిన తర్వాత రాయుడు తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు.
రాయుడు త్వరలోనే ఆంధ్రా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇదివరకే మీడియాలో, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. రాయుడు.. ఆంధ్రాలోని అధికార వైఎస్సార్‌సీపీలో చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు రాయుడు ఇప్పటికే పలుమార్లు ఆంధ్రా సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలవడం.. ట్విటర్ లో జగన్ పై ప్రశంసలు కురిపించే పనిపెట్టుకోవడం కూడా అతడి ఎంట్రీని చెప్పకనే చెబుతున్నాయి. అయితే రాయుడు ఎంట్రీ ఎంఎల్‌సీ తర్వాతే ఉంటుందని తెలుస్తున్నది. రాయుడు వైఎస్సార్సీపీలో చేరడం లాంఛనమే గానీ అతడు ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడనే విషయం మాత్రంపై స్పష్టత రావడం లేదు.
రాయుడుది ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలోని పొన్నూరు ప్రాంతం. ఇదే స్థానం నుంచి అతడు అసెంబ్లీకి పోటీ చేయాలని రాయుడు భావిస్తున్నాడని సమాచారం. అయితే అసెంబ్లీ కంటే అతడిని పార్లమెంట్ కే పంపించాలని ఏపీ సీఎం అనుకుంటున్నారట.
గుంటూరు లేదా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గానీ రాయుడును పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఐపీఎల్ - 16 గెలిచిన తర్వాత జగన్‌ను కలిసిన రాయుడుతో కూడా సీఎం దీని గురించే చర్చించినట్టు గుసగుసలు వినిపించాయి.
అయితే వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం ప్రకారం రాయుడును పార్లమెంట్ కే పంపాలని వైసీసీ అధినేత నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గుంటూరు లోక్‌సభ స్థానంలో 2018 లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ (గల్లా జయదేవ్) గెలిచింది. అయితే ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ.. రాయుడును గుంటూరు నుంచే పోటీ చేయించాలని ప్రణాళికలు రచిస్తోంది. కుల సమీకరణాలు కూడా రాయుడుకు అనుకూలంగా ఉన్నాయి. రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.