ఆ విషయంలో ధోని, కోహ్లి లతో పోలిస్తే హిట్ మ్యాన్ కు సవాలే.. : అజిత్ అగార్కర్
Ajit Agarkar Comments On Virat kohli: ఇప్పటికే పరిమిత ఓవర్ల సారథిగా ఉన్న రోహిత్ శర్మ కు టెస్టు బాధ్యతలు అప్పజెప్పొద్దని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై అగార్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పరిమిత ఓవర్ల లో టీమిండియాకు పూర్తి స్థాయి సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ కు వెస్టిండీస్ సిరీస్ రూపంలో తొలి సవాల్ (అంతకుముందు న్యూజిలాండ్ తో ఆడినా అది టీ20 సిరీస్) ఎదురుకానుంది. వన్డేలతో పాటు టెస్టులకు కూడా అతడినే కెప్టెన్ గా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అప్పగించాలని కొందరు.. టెస్టులకు అతడికి సారథ్య బాధ్యతలను ఇవ్వొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా స్పందించాడు. రోహిత్ శర్మ కంటే ముందున్న సారథులు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలు.. కొన్ని ప్రమాణాలు నెలకొల్పారని వాటిని అందుకోవడం అతడికి పెద్ద సవాలుతో కూడుకున్నదే అని అగార్కర్ వ్యాఖ్యానించాడు.
అగార్కర్ మాట్లాడుతూ.. ‘టీమిండియా మాజీ సారథులు ధోని, కోహ్లి ఫిట్నెస్ విషయంలో కొన్ని ప్రమాణాలను నెలకొల్పారు. ఫిట్నెస్ లో వారిని అందుకోవడం రోహిత్ ముందున్న అతిపెద్ద సవాల్.
ఫిట్నెస్ విషయంలో ధోని భారత జట్టులో ఆదర్శప్రాయుడిగా నిలుస్తాడు. అతడూ ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండి తన తోటి సహచరులకు ఆదర్శంగా నిలిచాడు. కోహ్లి దానిని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వాళ్లు చాలా అరుదుగా మ్యాచులకు దూరమయ్యేవాళ్లు. కానీ వాళ్లతో పోలిస్తే రోహిత్ శర్మ ఫిట్నెస్ ను నిలుపుకోవడం కష్టమే అనిపిస్తున్నది.
అతడిని కెప్టెన్ గా నియమించిన తర్వాతే.. దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు గాయంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. గతంలో కూడా పలుమార్లు అతడు ఫిట్నెస్ ను కాపాడుకోలేక గాయాల బారిన పడ్డాడు. అలా అయితే రోహిత్ అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండలేడు. ఇలాంటివి జట్టు ప్రదర్శనపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతాయి.
సారథిగా టీమిండియాను నడిపించినంత కాలం అతడు ఫిట్ గా ఉండటం హిట్ మ్యాన్ ముందున్న అతి పెద్ద సవాల్. ఒకవేళ అతడు ఫిట్ గా ఉండి అన్ని మ్యాచులకు అందుబాటులో ఉంటే టీమిండియాకు సగం భారం తగ్గినట్టే.. తద్వారా రోహిత్ కు జట్టులోని ప్రతి ఆటగాడిపై ఒక అవగాహన వస్తుంది.
పరిస్థితులకు తగ్గట్టు ఎవరు ఆడుతున్నారు..? అనే విషయంపై అతడు దగ్గరగా గమనించే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ల కోసం మంచి జట్టును తయారుచేసుకునే అవకాశం అతడికి దొరుకుతుంది.. ’ అని అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇంకా అగార్కర్ స్పందిస్తూ.. పూర్తి స్థాయి కెప్టెన్ అయితే రోహిత్ పై బాధ్యతలు మరింత పెరుగుతాయని అన్నాడు. తాత్కాలిక సారథి అయితే ఆ మ్యాచుల వరకే పరిమితమైతే సరిపోతుందని, కానీ ఫుల్ టైం కెప్టెన్పీ అంటే మాత్రం దూర దృష్టితో ఆలోచించాల్సి ఉంటుందని చెప్పాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును విజయవంతంగా నడిపించిన అతడు.. బ్యాటర్ గా సుదీర్ఘ అనుభవం కూడా గడించిన నేపథ్యంలో అవన్నీ రోహిత్ కు కలిసొస్తాయని అగార్కర్ తెలిపాడు.