అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ పేరు ఇదేనా... ఫ్రాంఛైజీ ఓనర్లు ఆ విషయం మరిచిపోయారా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీలు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంఛైజీతో పాటు అహ్మదాబాద్ జట్టు కూడా ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా మెగా క్రికెట్ లీగ్‌లోకి రాబోతున్నాయి...

రూ.7090 కోట్లు పెట్టి లక్నో ఫ్రాంఛైజీని దక్కించుకున్న ఆర్‌పీఎస్ గోయింకా జట్టు, బిడ్ సొంతం చేసుకున్న దగ్గర్నుంచి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది...
ఇంతకుముందు రైజింగ్ పూణే సూపర్ జెయింట్ సోషల్ మీడియా ఖాతాలను లక్నో ఫ్రాంఛైజీగా మార్చిన యాజమాన్యం, ఇప్పటికే జట్టు పేరును, లోగోను కూడా విడుదల చేశారు...
లక్నో సూపర్ జెయింట్ పేరుతో కొత్త జట్టు, ఐపీఎల్ 2022 సీజన్‌లో సందడి చేయనుంది. రూ.17 కోట్లు పెట్టి కెఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది ఎల్‌ఎస్‌జే టీమ్...
ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌తో పాటు పంజాబ్ కింగ్స్ యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌ని డ్రాఫ్ట్‌లుగా వేలానికి ముందు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్...
ఇప్పటికే కెఎల్ రాహుల్‌తో పాటు లక్నో ఫ్రాంఛైజీ యజమాని ఆర్‌పీ సంజీవ్ గోయింకా, మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలతో జట్టుపై హైప్ క్రియేట్ చేసే పనిలో యమా బిజీగా ఉన్నారు...
మరోవైపు రూ.5625 కోట్లకు అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్ మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి చప్పుడూ చేయడం లేదు. అసలు తాము ఐపీఎల్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసినట్టు సీవీసీ క్యాపిటల్‌కి గుర్తుందా? అని అనుమానిస్తున్నారు అభిమానులు...
హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, అతనితో పాటు రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్‌లను డ్రాఫ్ట్‌లుగా కొనుగోలు చేసింది. పాండ్యా, రషీద్ ఖాన్‌లకు చెరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ, టీ20లను టెస్టులుగా ఆడతాడనే విమర్శ ఉన్న శుబ్‌మన్ గిల్ కోసం రూ.8 కోట్లు చెల్లిస్తోంది...
ఇప్పటిదాకా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ పేరు ఖరారు కాలేదు. లోగో విడుదల చేయలేదు. ఆఖరికి లక్నో ఫ్రాంఛైజీ పేరిట అధికారిక సోషల్ మీడియా ఖాతాలు కూడా తెరవలేదు యాజమాన్యం...
అయితే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి ‘అహ్మదాబాద్ టైటాన్స్’ అనే పేరును పరిశీలిస్తున్నారట యాజమాన్యం. టైటాన్స్ పేరుతో పాక్ సూపర్ లీగ్‌లో కరాచీ టైటాన్స్, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్‌లో ‘టైటాన్స్’ పేరుతో జట్లు ఉన్నాయి. ప్రో కబడ్డీ లీగ్‌లో ‘తెలుగు టైటాన్స్’ అనే జట్టు ఉండగా, ‘అహ్మదాబాద్ టైటాన్స్’ పేరుతో ఓ లోకల్ టీమ్ కూడా ఉంది...
మెగా వేలానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ నిద్రలేవని అహ్మదాబాద్ యాజమాన్యం, ప్లేయర్ల సెలక్షన్ విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుజరాత్‌లోని క్రికెట్ ఫ్యాన్స్...