ఇండియాతో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. గాయంతో ముగ్గురు కీలక ప్లేయర్లు ఔట్
Australia Tour Of India: త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయంతో పర్యటనకు దూరమయ్యారు.

ఈనెల 20 నుంచి టీమిండియాతో మూడు టీ20లు ఆడేందుకు భారత్ కు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడి మొత్తం పర్యటనకే దూరమయ్యారు.
గాయపడినవారిలో సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తో పాటు ఆల్ రౌండర్లు మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు లేకుండానే ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానున్నది.
మిచెల్ స్టార్క్ మోకాలి నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. అతడింకా పూర్తిస్థాయిలో కోలుకోవాల్సిఉంది. దీంతో వచ్చేనెలలో టీ20 ప్రపంచకప్ పెట్టుకుని ఇప్పుడు మళ్లీ గాయపడితే అది మొదటికే మోసమని భావించిన ఆసీస్.. అతడిని తప్పించింది.
స్టార్క్ తో పాటు మిచెల్ మార్ష్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో మార్ష్ ఆడలేదు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవంతో మార్ష్ కు కూడా విశ్రాంతినిచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా.
ఇక ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్.. కొన్నిరోజులుగా పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ టీమిండియా తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ కు దూరమయ్యారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా.. మరో ముగ్గురితో ఈ స్థానాలను భర్తీ చేసింది. ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎలిస్, ఆల్ రౌండర్లు డేనియల్ సామ్స్, సీన్ అబాట్ లను ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక చేసింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 20న మొహాలీలో తొలి టీ20 జరుగనుండగా.. 23న నాగ్పూర్ లో రెండో టీ20, 25న హైదరాబాద్ లో మూడో మ్యాచ్ జరగాల్సి ఉంది.
భారత పర్యటనకు తాజాగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామరూన్ గ్రీన్, జోష్ హెజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా