Asia Cup 2022: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్
India vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత జట్టు నేటి రాత్రి కీలక పోరులో తలపడనుంది. ఆసియా కప్-2022లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త..

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య కీలక సమరానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ లు ఆసియా కప్ -2022లో భాగంగా తలపడనున్నాయి.
అయితే ఈ మెగా టోర్నీకి ముందు కరోనా బారిన పడ్డ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో ద్రావిడ్ కు నెగిటివ్ అని తేలింది. దీంతో అతడు రోహిత్ సేనతో కలువనున్నాడు.
Image credit: PTI
ఇదే విషయమై తాజాగా బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కొవిడ్ నెగిటివ్ వచ్చింది. దీంతో అతడు దుబాయ్ లోని భారత జట్టుతో చేరాడు. అతడి స్థానంలో తాత్కాలిక హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన వీవీఎస్ లక్ష్మణ్.. తిరిగి ఇండియాకు చేరుకున్నారు..’ అని ట్వీట్ చేసింది.
ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కాబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రావిడ్ భారత జట్టుతో కలవడం రోహిత్ సేనకు లాభించేదే.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆరాటపడుతున్నది. ఆ మేరకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఈ మ్యాచ్ గెలిచి పాకిస్తాన్ పై పైచేయి సాధించడమే గాక టోర్నీలో ముందడుగు వేయాలని టీమిండియాతో పాటు జట్టు అభిమానులూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రాహుల్ ద్రావిడ్ జట్టుతో కలవడం అది రోహిత్ సేనకు లాభించేదే.
టీ20 ప్రపంచకప్-2021 తర్వాత పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా దూసుకుపోతున్నది. రోహిత్-రాహుల్ ల జోడీ స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా మ్యాజిక్ చేస్తున్నది. వరుస విజయాలతో ముందుకెళ్తున్న టీమిండియా.. పాకిస్తాన్ పై బదులు తీర్చుకోవడం ఖాయమే అని అభిమానులు భావిస్తున్నారు.
2021లో పొట్టి ప్రపంచకప్ ముగిశాక భారత్ 16 టీ20లు ఆడగా అందులో ఏకంగా 12 మ్యాచులు గెలిచింది. మూడింటిలో మాత్రమే ఓడింది. ఇక ఆసియా కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో 8 సార్లు భారత్ గెలవగా.. 5 సార్లు పాక్ గెలిచింది.