వరల్డ్ కప్ ముగిసాక టీ20ల నుంచి రిటైర్ అవుతున్న రోహిత్, కోహ్లీ?... కుర్రాళ్ల కోసం సీనియర్ల రాజీ...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఆశించిన స్థాయి కంటే బెటర్ పర్ఫామెన్సే ఇస్తోంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడింది. బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగే మ్యాచులు, టీమిండియా సెమీ ఫైనల్ ఛాన్సులను డిసైడ్ చేయబోతున్నాయి...
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించనుంది టీమిండియా. ఈ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. 2021 నవంబర్‌లో విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా టీ20 కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్, గత ఏడాది కాలంలో కెప్టెన్సీ చేసిన టోర్నీల కంటే విశ్రాంతి తీసుకున్న సిరీసుల సంఖ్యే ఎక్కువ...
Image credit: PTI
రోహిత్ శర్మ తరుచూ రెస్ట్ తీసుకుంటుండడంతో ఈ ఏడాది ఇప్పటికే 8 మంది కెప్టెన్లను వాడేసింది భారత జట్టు. న్యూజిలాండ్ పర్యటనలో టీ20లకు హార్ధిక్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు... ఈ టూర్ నుంచి రెస్ట్ కావాల్సిందిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... బీసీసీఐని కోరినట్టు సమాచారం...
Virat Kohli-Rohit Sharma
అయితే టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మరో రెండేళ్లకు 2024లో వరల్డ్ కప్ జరగనుంది. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఫిట్‌నెస్ లెవెల్స్‌కి అప్పటిదాకా కొనసాగడం చాలా కష్టం. అలాగే 35 ఏళ్లు దాటిన విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ కాలం టెస్టులకు అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాడట...
ఈ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్న రోహిత్... టీ20లతో పాటు టెస్టులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం...
అన్నీ సజావుగా కుదురితే 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట రోహత్ శర్మ. విరాట్ కోహ్లీ మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడని... అయితే కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తే అతను కూడా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి...
ఈ ఇద్దరూ ఎప్పుడూ రిటైర్ అవుతారో క్లియర్‌గా తెలియకపోయినా టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ద్వైపాక్షిక టీ20 సిరీసులకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇకపై వన్డేలపైనే ఎక్కవ ఫోకస్ పెట్టబోతున్నారట రోహిత్, విరాట్ కోహ్లీ...
టీమ్‌లో ప్లేస్ కోసం రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దేవ్‌దత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, నితీశ్ రాణా... ఇలా కుర్రాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సీనియర్లు ‘రాజీ’నామా చేసేందుకు సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.