ప్యాడీ అప్టన్ ఉండి ఏం చేస్తున్నట్టు..? రాహుల్ వైఫల్యంపై సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు
T20 World Cup 2022: టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టీ20 ప్రపంచకప్ లో వరుస వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్ లో భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో గెలిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఓడింది. అయితే మూడు మ్యాచ్ లలోనూ ఓపెనర్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముప్పేట దాడి పెరుగుతున్న వేళ రాహుల్ కు భారత మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ కు మెంటల్ కండీషనింగ్ కోచ్ అవసరం ఎంతో ఉందని.. అతడు ఫుల్ ఫ్లో లో ఉన్నప్పుడు ఏం చేయగలడో అందరికీ తెలుసునని తెలిపాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత సన్నీ స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ.. ‘టీమిండియాకు మెంటల్ కండీషనింగ్ కోచ్ గా ప్యాడీ అప్టన్ ఉన్నాడు. రాహుల్ వంటి ఆటగాడి విషయంలో అతడు ఏ విధంగా సాయపడుతున్నాడనేది ఆసక్తికరం. ఒకవేళ అతడు ఏం చేయకుంటే ఎలా..? బ్యాటింగ్ కోచ్ (విక్రమ్ రాథోడ్) అతడికి రాహుల్ పదే పదే చేస్తున్న మిస్టేక్స్ చెప్పాలి.
టీ20 ప్రపంచకప్ లో భారత్ 3 మ్యాచ్ లు ఆడింది. సూపర్-12 స్టేజ్ లో మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మీకు (టమిండియాకు) రాహుల్ తప్ప మరో ఓపెనర్ కూడా లేడు. రాహుల్ ప్లేస్ ను భర్తీ చేయగల ఓపెనర్ జట్టులో మరొకరు ఉన్నాడని నేను అనుకోను. అతడి విషయంలో కాస్త ఓపిక వహించాలి.
ఒకవేళ రాహుల్ ఫుల్ స్వింగ్ లో ఉంటే ఎలా ఆడతాడు..? ఎలా పరుగులు చేస్తాడు..? అనే విషయం మనకు తెలుసు. అయితే తన బలాలను తనకు గుర్తు చేయడం చాలా ముఖ్యమైనది. అది మెంటల్ కండీషనింగ్ కోచ్ ద్వారానే సాధ్యం..’ అని సన్నీ చెప్పాడు.
ఈ టోర్నీలో రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత మూడు మ్యాచ్ లలో 4, 9, 9 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ వరుస వైఫల్యాలతో అతడిని ఇకనైనా పక్కనబెట్టాలని.. రిషభ్ పంత్ ను జట్టులోకి తీసుకుని రోహిత్ శర్మతో అతడిని ఓపెనింగ్ చేయించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టీమ్ మేనేజ్మెంట్ ఏం చేయనుందననేదానిపై ఆసక్తి నెలకొంది.