Sarfaraz Khan: రంజీలో వరుస సెంచరీలు.. టీమిండియాకు ఆడనున్న సర్ఫరాజ్..!
Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ-2022 లో సెంచరీలతో చెలరేగుతున్న ముంబై యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.

రంజీ ట్రోఫీ-2022 లో వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టు తరఫున ఆడనున్నాడు. ప్రస్తుత రంజీ సీజన్ లో అతడు ఇప్పటికే 937 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఒక సీజన్ లో 900 ప్లస్ స్కోరు చేయడం సర్ఫరాజ్ కు ఇది రెండో సారి. 2019-20 సీజన్ లో కూడా సర్ఫరాజ్ ఈ ఫీట్ సాధించాడు. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న అతడిని భారత జట్టులోకి తీసుకోవాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో సెలక్టర్లు కూడా సర్ఫరాజ్ మీద దృష్టి పెట్టారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు ముగిశాక భారత్ వరుసగా టీ20 సిరీస్ లే ఆడాల్సి ఉంది. అక్టోబర్ లో ఆసీస్ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు సర్ఫరాజ్ ఎంపికవడం ఖాయమని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే విషయమై సెలక్షన్ కమిటీకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘గతకొంతకాలంగా అతడి ఫామ్ చూస్తుంటే సర్ఫరాజ్ ఫామ్ ను పక్కనబెట్టడం చాలా కష్టం. భారత జట్టుకు అతడు ఎంత అవసరమో అతడి ప్రదర్శనలే చెబుతున్నాయి. భారత జట్టు బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కు వెళ్లే జట్టులో సర్ఫరాజ్ కచ్చితంగా ఉంటాడు..
అతడు గతంలొో భారత్ ‘ఎ’కు ఆడి బాగా రాణించాడు. సర్ఫరాజ్ మంచి బ్యాటరే గాక అద్భుతమైన ఫీల్డర్ కూడా.. అతడు కచ్చితంగా మా దృష్టిలో ఉన్నాడు..’ అని చెప్పుకొచ్చాడు. 24 ఏండ్ల ఈ ముంబై కుర్రాడు రంజీ ట్రోఫీ-2022 ఫైనల్స్ లో ముంబై బ్యాటర్లు అంతా విఫలమైనా అతడు మాత్రం ఓపికగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో 134 పరుగులు చేసి ముంబై ఫైటింగ్ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
కాగా టీమిండియాలోకి సర్ఫరాజ్ ఆగమనం గురించి తనకు తెలియదని.. కానీ ఇటీవలే సెలక్షన్ కమిటీలోని పలువురు తనతో మాట్లాడారని అతడు చెప్పుకొచ్చాడు. ‘ఇటీవలే నాకు సెలక్షన్ కమిటీలో ఇద్దరు కీలక వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్లు నా ఆటను మెచ్చుకున్నారు. అయితే టీమిండియా సెలక్షన్ కోసం నేనింకా చాలా కష్టపడాలి. ప్రస్తుతం నా దృష్టంతా బాగా పరుగులు చేయడం మీదే ఉంది.. జాతీయ జట్టు గురించి నేను కూడా కలలు కంటున్నాను. నా తలరాతలో అది రాసుంటే కచ్చితంగా జరిగి తీరుతుంది..’ అని చెప్పడం విశేషం.