- Home
- Sports
- Cricket
- ODI WC 2023: ఆసీస్‌తో భారత్ వరల్డ్ కప్ వేట ప్రారంభం..! ఇండియా - పాక్ మ్యాచ్ ఎప్పుడుంటే..?
ODI WC 2023: ఆసీస్‌తో భారత్ వరల్డ్ కప్ వేట ప్రారంభం..! ఇండియా - పాక్ మ్యాచ్ ఎప్పుడుంటే..?
ICC ODI WC 2023: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీలో ఫస్ట్ జరుగబోయే మ్యాచ్, భారత్ షెడ్యూల్ పై ఆసక్తికర విషయాలు ఇవిగో..

Image credit: PTI
పదేండ్ల తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌కు బీసీసీఐ సన్నాహకాలు ముమ్మరం చేస్తున్నది. ఐపీఎల్ -16 ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నది. కాగా 13 వ ఎడిషన్ గా అక్టోబర్ నుంచి జరుగబోయే ఈ మెగా టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ ఏ ఏ జట్ల మధ్య జరుగనుంది..? వేదికలు ఏవి..? భారత్ - పాక్ మ్యాచ్ ఎప్పుడు ఉంది..? ఈ మెగా టోర్నీలో భారత్ ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడనుంది..? వంటి ఆసక్తికర విషయాలు పలు జాతీయ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి.
క్రిక్ బజ్ లో వచ్చిన కథనం ప్రకారం.. 2023 వన్డే వరల్డ్ కప్ లో ప్రారంభ మ్యాచ్ గత టోర్నీ ఫైనలిస్టుల మధ్య జరుగనుంది. అహ్మదాబాద్ లోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మ్యాచ్ తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరుగనుంది.
స్వదేశంలో జరుగబోయే వన్డే ప్రపంచకప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నై లోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న (ఆదివారం) జరుగనున్నట్టు సమాచారం.
వరల్డ్ కప్ ను అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ధర్మశాల, ముంబై, రాజ్‌కోట్, గువహతి, రాయ్‌పూర్, హైదరాబాద్ వంటి నగరాలలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. ఈ స్టేడియాల పునర్నిర్మాణం కోసం కూడా రూ. 500 కోట్ల మేరకు ఖర్చు పెట్టనున్నది. ఐపీఎల్ - 16 సీజన్ ముగిసిన వెంటనే ఈ పనులు కూడా మొదలవుతాయి.
Image credit: Wikimedia Commons
అయితే తుది షెడ్యూల్ కు సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఐపీఎల్ -16 ముగిసిన వెంటనే ఇది వెలువడే అవకాశం ఉంది. ఆసియా కప్ నిర్వహణ వివాదం నేపథ్యంలో అసలు పాకిస్తాన్ వరల్డ్ కప్ ఆడుతుందా..? లేదా..? అన్నది స్పష్టత లేదు. ఈ నెల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
పది దేశాలు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో తాజాగా దక్షిణాఫ్రికా 8వ బెర్త్ ను సొంతం చేసుకుంది. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికాలు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి.
జూన్ - జులై లో జింబాబ్వే వేదికగా జరిగే క్వాలిఫై రౌండర్ లో జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్స్, ఓమన్, నేపాల్, శ్రీలంక, యూఎస్ఎ, యూఏఈ, వెస్టిండీస్, ఐర్లాండ్ లు క్వాలిఫై ఆడతాయి. వీటిలో టాప్-2 గా నిలిచిన జట్లు ప్రపంచకప్ టాప్-8 టీమ్స్ తో కలుస్తాయి.