- Home
- Sports
- Cricket
- IND vs SL: ఇదేం బాగోలేదు.. కోహ్లి వందో టెస్టుకు ఇన్ని ఆంక్షలా..? బీసీసీఐ తీరుపై సన్నీ ఆగ్రహం
IND vs SL: ఇదేం బాగోలేదు.. కోహ్లి వందో టెస్టుకు ఇన్ని ఆంక్షలా..? బీసీసీఐ తీరుపై సన్నీ ఆగ్రహం
Virat Kohli 100th Test: ఇటీవలే జరిగిన విండీస్ తో టీ20 సిరీస్ ను ప్రేక్షకుల మధ్యే జరిపించిన బీసీసీఐ.. లంకతో ముగిసిన టీ20 సిరీస్ లో కూడా ప్రేక్షకులను అనుమతించింది. కానీ మొహాలి టెస్టులో మాత్రం కావాలనే...

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి వందో టెస్టును ప్రేక్షకుల్లేకుండా ఖాళీగా నిర్వహించాలన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఈనెల 4 నుంచి శ్రీలంకతో మొహాలీ వేదికగా తొలి టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఇది విరాట్ కోహ్లి కెరీర్ లో వందో టెస్టు..
అయితే ఈ మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించేది లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతుండగా.. భారత సీనియర్లు కూడా విరాట్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇదే విషయమై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. ఒక క్రికెటర్ కు కెరీర్ లో వందో టెస్టు ఎంతో చిరస్మరణీయమైందని, మరీ ముఖ్యంగా భారత క్రికెట్ కు విశిష్ట సేవలందించిన కోహ్లికి ఇది మరుపురాని గొప్ప అనుభూతి అని.. కానీ బీసీసీఐ ఇలా వ్యవహరించడం సరికాదని చెప్పారు.
తొలి టెస్టుకు ఇంకా రెండు రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో సన్నీ స్పందిస్తూ.. ‘మీరు ఏ ఆట తీసుకున్నా ప్రేక్షకుల మధ్య ఆడితే వచ్చే కిక్కే వేరు. ఇటీవలి కాలంలో భారత జట్టు పెద్దగా అభిమానుల సమక్షంలో ఆడలేదు. ఒక ఆటగాడికైనా, నటుడికైనా ప్రేక్షకుల ముందు ఫర్ఫార్మ్ చేయాలని ఉంటుంది.
ఇక విరాట్ కోహ్లికి ఇది వందో టెస్టు. కానీ ఈ టెస్టును ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించడం నిజంగా బాధాకరం. ఇది అతడిని తీవ్ర నిరాశకు గురిచేసేదే..’ అని చెప్పారు.
భారత్ తరఫున ఇప్పటిదాకా 99 టెస్టులాడిన కోహ్లి.. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉండగా.. 28 హాఫ్ సెంచరీలున్నాయి. అంతేగాక భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీ (7) లు చేసిన ఆటగాడు కోహ్లి మాత్రమే..
ఇదిలాఉండగా.. బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి మీద బీసీసీఐ కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆరోపిస్తున్నారు.
ఇటీవలే లంకతో ముగిసిన టీ20 సిరీస్ లో అభిమానులను అనుమతించిన బీసీసీఐ... రెండో టెస్టు జరిగే బెంగళూరు లో కూడా ప్రేక్షకుల మధ్యే జరపాలని నిర్ణయించింది. కానీ మొహాలీ టెస్టును మాత్రం ఖాళీ స్టేడియంలో జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.