Car: పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏం జరుగుతుంది.? వెంటనే ఏం చేయాలి.?
Car: కార్లలో ఫ్యూయల్ కొట్టించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్రోల్ కారులో డీజిల్ కొట్టించడం, డీజిల్ కారులో పెట్రోల్ కొట్టించడం లాంటివి చేస్తే సమస్యలు తప్పవు. అయితే ఒకవేళ పొరపాటున తప్పుగా ఇంధనం కొట్టిస్తే ఏం జరుగుతుందంటే.

పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏం జరుగుతుంది.?
పెట్రోల్, డీజిల్ రెండూ వేర్వేరు రకాల ఇంధనాలు. ఇవి పనిచేసే విధానం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ టెక్నాలజీలు వేరు కావడంతో ఒక ఇంధనానికి బదులుగా మరొకటి వాడితే ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. డీజిల్‌ను పెట్రోల్ ఇంజిన్ సరిగా దహనం చేయలేకపోవడంతో ఇంజిన్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యూయల్ సిస్టమ్, ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంప్ వంటి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
పొరపాటు తెలిసిన వెంటనే ఏం చేయాలి.?
మీ పెట్రోల్ కారులో డీజిల్ నింపారని తెలిసిన వెంటనే చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని కారు స్టార్ట్ చేయకుండా ఉండటం. ఒకసారి ఇంజిన్ ఆన్ చేస్తే డీజిల్ మొత్తం ఫ్యూయల్ సిస్టమ్‌లోకి చేరిపోతుంది. అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే వాహనాన్ని అక్కడికక్కడే ఆపి, వేరే వాహనం సహాయంతో సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తరలించాలి. నిపుణులు ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేసి, ఫ్యూయల్ లైన్లను శుభ్రం చేస్తారు. దీంతో పెద్ద నష్టం జరిగే అవకాశాలు తగ్గుతాయి.
కొద్దిగా డీజిల్ పడితే ప్రమాదం తక్కువేనా?
కొన్ని సందర్భాల్లో ట్యాంక్‌లో ఇప్పటికే ఎక్కువ పెట్రోల్ ఉండగా, పొరపాటున కొద్దిపాటి డీజిల్ మాత్రమే పడితే ప్రమాదం తక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. వాహన తయారీ సంస్థ సూచనలు లేదా సర్వీస్ సెంటర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాహనం ఫ్యూయల్ సిస్టమ్ సామర్థ్యం భిన్నంగా ఉంటుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఖరీదైన రిపేర్ల నుంచి తప్పించుకోవచ్చు.
డీజిల్ నింపిన తర్వాత కారు నడిపితే ఏమవుతుంది?
పొరపాటు తెలిసేలోపే కారు స్టార్ట్ చేసి కొంత దూరం నడిపితే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ సరిగా పని చేయకపోవడంతో ఇంజిన్ మిస్‌ఫైర్ అవ్వడం, అధిక పొగ రావడం, వైబ్రేషన్లు పెరగడం, స్టార్టింగ్ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ఎక్కువ దూరం నడిపితే ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లు, ఇతర కీలక భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఫ్యూయల్ లైన్ మొత్తం శుభ్రం చేయడంతో పాటు కొన్ని విడిభాగాలను మార్చాల్సి రావచ్చు. దీంతో భారీ ఖర్చు భరించాల్సి వస్తుంది.
ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఇంధనం నింపించే ముందు మీ వాహనం ఏ ఇంధనంతో నడుస్తుందో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఫ్యూయల్ స్టేషన్ సిబ్బందికి కూడా స్పష్టంగా పెట్రోల్ లేదా డీజిల్ అని చెప్పాలి. ఫ్యూయల్ క్యాప్‌పైన పెట్రోల్ అయితే P అని డీజిల్ అయితే D అనే రేడియం స్టిక్కర్స్ వేయాలి. ఇలా చేయడం వల్ల పెట్రోల్ బంక్ నిర్వాహకులకు కూడా అది ఏ వాహనమో క్లారిటీ ఉంటుంది.

