Unemployment: దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారా? మహిళలకు ఉద్యోగాలే దొరకడం లేదా?
Unemployment : భారతదేశంలో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ 2025లో 5.2 శాతం పెరిగింది. మరీ ముఖ్యంగా, మహిళల్లో నిరుద్యోగ రేటు గరిష్ట స్థాయికి చేరుకుందని సర్వేలు చెబుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని సర్వేలో తేలింది.

నిరుద్యోగం..
భారత దేశంలో నిరుద్యోగుల రేటు రోజు రోజుకీ పెరిగిపోతోందా? మరీ ముఖ్యంగా మహిళల్లో నిరుద్యోగ రేటు తగ్గిపోతోందా? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన నెలవారీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి నిరుద్యోగ రేటు సెప్టెంబర్ 2025లో స్వల్పంగా పెరిగి 5.3 శాతానికి చేరుకుంది. ఈ సంఖ్య ఆగస్టులో 5.1 శాతం ఉండగా.. ఇప్పుడు ఇంకాస్త పెరిగింది. మహిళల్లో అయితే... ఈ నిరుద్యోగ రేటు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.
మహిళలకు ఉద్యోగాలు దొరకడం లేదా?
ఈ నివేదిక ప్రకారం, మహిళలే ఉపాధి దొరకక ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో నిరుద్యోగం రేటుు ఆగస్టులో 4 శాతంగా ఉండగా సెప్టెంబర్ కి 4.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగ శాతం 4.5 శాతం నుంచి 4.7 శాతానికి చేరుకుంది. పట్టణాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నగరాల్లో మహిళల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ లో 9.3 శాతానికి చేరుకుంది. ఆగస్టులో 8.9 శాతంగా ఉండేది. ఇక.. పురుషుల విషయానికి వస్తే... 5.9 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. అంటే... మహిళలే ఎక్కువగా ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతున్నారు.
పని చేసేవారికంటే... పనికోసం ఎదురుచూసేవారే ఎక్కువ...
పని చేసే వారికంటే... పని కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య వరసగా మూడో నెల కూడా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ రేటు జూన్ 2025లో 54.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ లో 55.3 శాతంకి పెరిగింది. ఇది గత ఐదు నెలల్లో అత్యధికం. గ్రామీణ ప్రాంతాల్లో జూన్ లో 56.1 శాతం నుంచి 57.4 శాతానికి పెరిగింది. మొత్తానికి సర్వేలో తేలిన విషయం ఏమిటంటే... ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. కానీ.... వారి కోరికలకు తగినట్లు ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదని అర్థమౌతుంది.