8వ వేతన సంఘం ఏర్పాటు ఎప్పుడు? ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది? కీలక అప్ డేట్
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపే అవకాశాలున్నాయి. ఈ ఏడాదే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్ల నిరీక్షణకు తెరదించనుందా?

8వ వేతన సంఘం కోసం ఉద్యోగుల ఎదురుచూపులు
8th Pay Commission : సరిగ్గా ఈ ఏడాది (2025, జనవరిలో) ఆరంభంలో 8వ వేతనసంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది... అంటే ఇప్పటికే దాదాపు 10 నెలలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు వేతనసంఘం ఏర్పాటు విషయంతో అడుగు ముందుకు పడలేదు... ప్యానెల్ ఏర్పాటు జరగలేదు. ఈ జాప్యంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లలో ఆందోళన పెరిగింది. ఉద్యోగ సంఘాలు వీలైనంత త్వరగా కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
ప్రధాని మోదీకి ఉద్యోగ సంఘాల లేఖ
ఇటీవల CSSF (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరమ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. 7వ వేతన సంఘం అమలుకు రెండేళ్ల ముందే ఏర్పాటైందని... దాంతో అధ్యయనం చేసి, సూచనలు సిద్ధం చేయడానికి తగినంత సమయం దొరికిందని అందులో పేర్కొంది. కానీ ఈసారి ప్రభుత్వం జనవరి 2025లో 8వ వేతన సంఘాన్ని ప్రకటించినా, ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు... ఛైర్‌పర్సన్, సభ్యుల నియామకం జరగలేదు. కేంద్రం వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసి, దాని పదవీకాలం ప్రారంభమయ్యే తేదీని నిర్ణయించాలని CSSF డిమాండ్ చేసింది. 'సమయానికి ఏర్పాటు చేయకపోతే జనవరి 1, 2026 నుంచి కొత్త సిఫార్సులు అమలు కావు, దీనివల్ల ఉద్యోగుల బకాయిలపై ప్రభావం పడుతుంది' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
8వ వేతన సంఘం నివేదిక ఆలస్యం అవుతుందా?
ఇప్పటివరకు ఉన్న వేతన సంఘాలను చూస్తే… ప్రతి కమిషన్ తన నివేదికను సిద్ధం చేసి, అమలు చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం నవంబర్ 2025 నాటికి నోటిఫికేషన్ జారీ చేసినా నివేదిక 2027 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది… జీతాల సవరణ జనవరి 2028 నుంచి అమలు కావచ్చు. అయితే ఈసారి ప్రభుత్వం ఈ ప్రక్రియను ఏడాదిలోపే పూర్తి చేసేలా టైమ్‌లైన్‌ను తగ్గించే ప్రయత్నంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు 2027 ప్రారంభంలోనే కొత్త జీతం అందవచ్చు.
ఉద్యోగులకు ఊరట లభిస్తుందా?
కమిషన్ సిఫార్సులు ఆలస్యంగా అమలైనా, ప్రభుత్వం వాటిని జనవరి 1, 2026 నుంచి వర్తింపజేయవచ్చు. గతంలో కూడా ఇలాగే జరిగింది. 7వ వేతన సంఘం సిఫార్సులు జూన్ 2016లో అమలైనా, వాటిని జనవరి 1, 2016 నుంచే రెట్రోయాక్టివ్‌గా పరిగణించారు. ఉద్యోగుల స్థైర్యం దెబ్బతినకుండా, ప్రభుత్వంపై ఆర్థిక భారం నెమ్మదిగా పడేలా ఈసారి కూడా ప్రభుత్వం ఇదే మార్గాన్ని అనుసరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
8వ వేతన సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
ప్రభుత్వం నవంబర్ 2025 చివరి నాటికి 8వ వేతన సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. తద్వారా కమిషన్‌కు తగినంత సమయం దొరికి 2026 నుంచి కొత్త వేతన విధానం అమల్లోకి వస్తుంది.
8వ వేతన సంఘంపై ఉద్యోగులకు ఎదురయ్యే సాధారణ ప్రశ్నలు... వాటికి జవాబులు (FAQs)
ప్రశ్న : 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది?
జవాబు : ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది (జనవరి 2025లో).. కానీ నోటిఫికేషన్ జారీ కాలేదు. ప్రభుత్వం నవంబర్ 2025 చివరి నాటికి దీనిని ఏర్పాటు చేస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.
ప్రశ్న : 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
జవాబు : ప్రభుత్వం సమయానికి కమిషన్‌ను ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావచ్చు. అయితే జాప్యం జరిగితే ప్రభుత్వం వాటిని రెట్రోయాక్టివ్‌గా (గత తేదీ నుంచి వర్తింపజేయడం) కూడా అమలు చేయవచ్చు.
ప్రశ్న : 8వ వేతన సంఘం వల్ల ఎవరికి ప్రయోజనం?
జవాబు : ఈ కమిషన్ వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారు. మొత్తం మీద 1.15 కోట్ల మందికి పైగా జీతాలు, పెన్షన్ విధానం ప్రభావితం అవుతుంది.
ప్రశ్న : 8వ వేతన సంఘంతో జీతం ఎంత పెరగవచ్చు?
జవాబు : ఖచ్చితమైన సంఖ్య కమిషన్ సిఫార్సుల తర్వాతే తెలుస్తుంది... కానీ 7వ వేతన సంఘంలో లాగే ప్రాథమిక వేతనంలో 30% నుంచి 35% వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా.
ప్రశ్న : 8వ వేతన సంఘంలో ఉద్యోగుల జీతాలు వెంటనే పెరుగుతాయా?
జవాబు : లేదు, ముందుగా కమిషన్ సిఫార్సులు చేస్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం వాటిని ఆమోదిస్తుంది. జీతాల పెంపు అమలయ్యాక ఉద్యోగులకు బకాయిలు (Arrears) కూడా చెల్లించవచ్చు.