- Home
- Careers
- 8th Pay Commission : 45 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?
8th Pay Commission : 45 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?
8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర చర్యలు చేపట్టింది. తాజాగా పార్లమెంట్ వేదికన ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వేతనసంఘం ముందు కొన్ని డిమాండ్లను ఉంచేందుకు ఉద్యోగులు కూడా సిద్దమయ్యారు. మరి 8వ వేతనసంఘం గుడ్ న్యూస్ చెబుతుందా?

8వ వేతన సంఘంపైనే ఉద్యోగుల ఆశలన్నీ..
జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమలులోకి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ డిమాండ్లను పే కమీషన్ ముందుంచేందుకు ఉద్యోగులు సిద్దమయ్యారు. ప్రభుత్వం కూడా వేతనసంఘం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ లో పే కమీషన్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు రాష్ట్రాల నుండి అభిప్రాయాలు కోరినట్లు... త్వరలోనే కమీషన్ ను అధికారికంగా నోటిఫై చేస్తామన్నారు. తర్వాత ఫే కమీషన్ ఛైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం 7వ వేతన సంఘం కొనసాగుతోంది. 8వ వేతన సంఘం సిపార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు సవరించబడతాయి. తద్వారా దాదాపు 45 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు ప్రయోజనాన్ని పొందుతారు.
పాత పింఛను పథకం (OPS) పునరుద్ధరణ, ఉచిత వైద్యం, పిల్లలకు విద్యకు ఆర్థిక సహాయం వంటి అనేక సంస్కరణలను కొత్త వేతనసంఘం సిపార్సుల్లో ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ప్రాథమిక ప్రణాళిక దశలో భాగంగా ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన డిమాాండ్ ఇదే
2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి కూడా పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలనేది ప్రధాన డిమాండ్. ప్రస్తుతం ఈ ఉద్యోగులు కొత్త పింఛను పథకం (NPS) కింద ఉన్నారు. ఇది కాంట్రిబ్యూటరీ పద్ధతిలో ఉండి తక్కువ భద్రత కలిగి ఉంటుంది. గత OPS లాగే ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పింఛను హామీని కోరుకుంటున్నారు. పాత, కొత్త పింఛనుదారులకు సమాన పింఛను ప్రయోజనాలు, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పింఛను పెంపును కూడా ఉద్యోగులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఇక పింఛనుదారులకు పూర్తి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ సర్వీస్ వంటి విభాగాల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సరైన వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న విద్యా ఖర్చుల దృష్ట్యా, ఉద్యోగ సంఘాలు తమ పిల్లల పాఠశాల విద్యకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఉద్యోగులకు పిల్లలకు ఆర్థిక సాయం
అందరు ఉద్యోగుల పిల్లలకు చదువుకు ఆర్థిక సహాయం అందించాలి, ఇందులో ఇంటి నుండి దూరంగా చదువుకునే పిల్లలకు వసతి సదుపాయం కూడా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక కారణాల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకుండా ఉండేందుకు ఈ సహాయం అందించాలని… పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఈ సాయం ఉండాలని కోరుతున్నారు.
గ్రామీణ డాక్ సేవకులు, పారా మిలిటరీ దళాలు, స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను కూడా చేర్చేలా మాడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (MACP) పథకాన్ని సవరించాలని కూడా డిమాండ్ ఉంది.
ఈ ఉద్యోగులకు స్పెషల్ అలవెన్సులు
పేలుడు పదార్థాలు, రసాయనాలు లేదా ఆయుధాల విభాగంలో అంటే ప్రమాదకరమైన పనులుచేసే కార్మికులు ప్రత్యేక ప్రమాద భత్యం, బీమా రక్షణ కోరుతున్నారు. వారు వేతన స్కేళ్లలో మార్పులను కూడా ప్రతిపాదించాలని సూచిస్తున్నారు.
కనీస వేతనం లెక్కించడానికి ఉపయోగించే ప్రామాణిక వినియోగ యూనిట్ (SCU) పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వం ప్రస్తుతం అన్ని సిఫార్సులను సమీక్షిస్తోంది. కీలక శాఖలతో సంప్రదింపుల తర్వాత కమిషన్ లక్ష్యాలు, నిబంధనలను ఖరారు చేస్తుంది.