Zomato: జొమాటాలో హెల్తీ మోడ్.. ఇంతకీ ఏంటీ ఫీచర్.? ఎలా పనిచేస్తుంది.?
Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. దీంతో యూజర్లను ఆకర్షించే క్రమంలో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జొమాటో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

జొమాటాలో కొత్త ఫీచర్
పట్టణాల్లో ముఖ్యంగా 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఇప్పుడు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆరోగ్యకరమైన ఆహారం డిమాండ్ పెరుగుతుండటంతో, జొమాటో Healthy Mode అనే సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు కేవలం రుచికోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి తోడ్పడే వంటకాలను కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
హెల్తీ మోడ్ అంటే ఏంటి.?
జొమాటో యాప్‌లోని ఈ కొత్త సెక్షన్‌లో Healthy Score తో కూడిన వంటకాలు కనిపిస్తున్నాయి. ఈ స్కోర్ Low నుంచి Super వరకు ఉంటుంది. హెల్తీ మోడ్‌ను నిర్ణయించే అంశాలు.
* ప్రోటీన్
* కంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్
* ఫైబర్
* మైక్రోన్యూట్రియంట్స్
* కేలరీలు
ఈ విధంగా యూజర్ ఆర్డర్ చేసే వంటకం ఎంత ఆరోగ్యకరమో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.?
జొమాటో రెస్టారెంట్ భాగస్వాములకు సహాయం కోసం అడ్వాన్స్‌డ్ AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) ను ఉపయోగిస్తోంది. వీటి సహాయంతో ప్రతి వంటకానికి సంబంధించిన పూర్తి పోషక విలువలు (macronutrient profile) తయారు చేశారు. ఒకవేళ యూజర్ Healthy Mode ఆన్ చేస్తే.. ప్రతి వంటకానికి Healthy Score కనిపిస్తుంది. దానిని బట్టి మెన్యూలో ఫిల్టర్ చేసుకుని, తగిన వంటకాన్ని ఎంచుకోవచ్చు.
ఈ రేటింగ్ ఎవరిస్తారు.?
హెల్తీ స్కోర్‌ను డెలివరీ బాయ్ ఇవ్వరు. దీనిని Zomato AI సిస్టమ్, రెస్టారెంట్ల డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే కస్టమర్‌కి యాప్‌లో కనిపించే స్కోరు పూర్తిగా సైంటిఫిక్ క్యాల్క్యులేషన్లతో ఉంటుంది.
త్వరలోనే దేశ వ్యాప్తంగా.
ప్రస్తుతం ఈ హెల్తీ మోడ్ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్‌లో అధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే భారత్‌లోని ఇతర అన్ని ప్రధాన నగరాల్లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఆహారం ఎంపికలో మరింత ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.