రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోతే మనకు పండగే, మన దేశంలో వీటి ధరలు అమాంతం తగ్గిపోతాయి
రష్యా ఉక్రెయిన్ మధ్య మూడున్నరేళ్లుగా యుద్ధం సాగుతూనే ఉంది. ఆ యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఆ యుద్ధం ఆగిపోతే మన దేశానికి ఎంత లాభమో తెలుసా?

త్వరలో రష్యా - ఉక్రెయిన్ యుద్దం ఆగే అవకాశం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గత మూడున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. దీంతో ఆ రెండు దేశాలకే కాదు ప్రపంచ దేశాలు కూడా విసుగు వచ్చేసింది. ఆ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే పుతిన్ తో చర్చలు గడిచిపోయాయి. ఇప్పుడు జెలెన్స్కీతో కూడా జరుగుతున్నాయి. యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దీనికి యూరోపియన్ దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. రష్యాతో పోలిస్తే యుద్ధం ఆపాలని ఉక్రెయిన్ పైనే ట్రంప్ అధికంగా ఒత్తిడిని పెంచుతున్నాడు. త్వరలో ఆగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
యుద్ధం ఆగితేనే కంటినిండా నిద్ర
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోతే ఆ దేశాల్లో శాంతి నెలకొని ఉంటుంది. అక్కడి ప్రజలు ప్రశాంతంగా నిద్ర పోగలరు. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని రకాల మార్పులు కలిగే అవకాశం ఉంది.ఆ యుద్ధం ఆగిపోతే మనదేశంలో కొన్ని వస్తువుల ధరలు చాలా తగ్గుతాయి. ఇది పేదవాడికి మంచి వార్తగానే చెప్పుకోవాలి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఇండియా మార్కెట్ పై ప్రభావాన్ని చూపించింది. అదే యుద్ధం ఆగిపోతే మాత్రం మన దేశానికి ఎన్ని రకాల ఉపయోగాలు కలుగతాయో చూద్దాం.
చమురు ధరలు తగ్గుతాయి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక గ్యాస్, చమురు ధరలు చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు ఆ ధరలను భరించలేకపోయాయి. యుద్ధం ఆగితే ఆ ధరలు చాలా వరకు తగ్గుతాయి. భారతదేశం రష్యా నుండి చమురును కొంటోంది. యుద్ధం ముగిసిపోయాక అమెరికా సుంకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అప్పుడు భారతదేశానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. కానీ యుద్ధం ఆగిపోయాక రష్యా చమురు ధరలు పెంచితే మాత్రం మన దేశంలో ద్రవ్యోల్బనం పెరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ రష్యా ధరలు పెంచకపోవచ్చు కూడా.
గోధుమలు చవకగా
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మన దేశ ఆహార మార్కెట్ పై, వ్యవసాయంపై భావాన్ని చూపిస్తుంది.ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా గోధుమలు, మొక్కజొన్నకు అతిపెద్ద ఎగుమతిదారులు. యుద్ధం కారణంగా ఆ ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలు పెరిగిపోయాయి. యుద్ధం ఆగిపోతే ఈ రెండు ఆహార పదార్థాలు ధరలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. భారతదేశం కూడా మొక్కజొన్నను, గోధుమలను ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం ఆగిపోతే వాటి ధరలను తిరిగి తగ్గిపోతాయి.
దిగుమతులు ఎగుమతులపై ఎఫెక్ట్
యుద్ధం వల్ల వివిధ వస్తువుల సరఫరాలో కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. అదే యుద్ధం ఆగిపోతే ఎగుమతులు, దిగుమతులు సులువుగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలలో ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ముఖ్యంగా భారతదేశంలో బంగారం, వెండి ధరలు పెరగడం చాలా వరకు ఆగే అవకాశం కూడా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏం జరిగినా కూడా ఆ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై ప్రభావం కనిపిస్తుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మన భారతదేశానికి ఏమిటి సంబంధం అనుకోవద్దు... ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన కూడా మిగతా దేశాలపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది.