TVS, PVR, MRF, Amul, Paytm .. ఈ టాప్ 5 ఇండియన్ కంపెనీల అసలుపేర్లేంటో తెలుసా?
టివిఎస్, పేటిఎం, అమూల్, ఎంఆర్ఎఫ్, పివిఆర్ వంటి ప్రముఖ కంపెనీలు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. అయితే ఈ పేర్లు ఆ కంపనీల షార్ట్ ఫామ్‌లే అట... మరి వాటి అసలు పేర్లేంటో తెలుసా?

ఈ సంస్థల అసలు పేర్లోంటో తెలుసా?
ప్రతిరోజు మనం వాడే వస్తువులే, మనం వెళ్లే స్థలాలే, చూసే సంస్థలే... కానీ వాటి అసలు పేర్లు ఏమిటో తెలియవు. ప్రముఖ నాయకుల మాదిరిగానే దేశంలోని ప్రముఖ సంస్థలకు షార్ట్ కట్ పేర్లున్నాయి… కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు సిబిఎన్, నందమూరి తారక రామారావును ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్సార్ పేర్లతోనే ప్రజలకు గుర్తుండిపోయారు. ఇలాగే టివిఎస్, పివిఆర్, ఓయో, అముల్, పేటిఎం ,హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఆర్ఎఫ్ వంటివి ఆ సంస్థల షార్ట్ కట్ పేర్లే... ఇలా సంక్షిప్త రూపాలతో ప్రాచుర్యం పొందిన సంస్థల అసలు పేర్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
TVS (టివిఎస్)
టివిఎస్ అనేది భారతదేశంలో ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ... దీని ప్రధాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంది. దేశంలో అత్యధికంగా ఉపయోగించే వాహనాల్లో టివిఎస్ కు చెందినవే అధికంగా ఉంటాయి. ప్రతిఏటా దాదాపు 30 లక్షలకు పైగా టివిఎస్ వాహనాలు అమ్ముడుపోతాయట... దీన్నిబట్టే ఈ వాహనాలు దేశంలోని కోట్లాదిమంది వద్ద ఉన్నాయని అర్థమవుతుంది.
అయితే ఈ వాహనాలను వాడుతున్న కోట్లాదిమందికి టివిఎస్ అంటే ఏమిటో తెలుసా? చాలామందికి తెలిసుండదు. టివిఎస్ అనేది సంక్షిప్తరూపం... దీని పూర్తి పేరు తిరుక్కురుంగుడి వెంగరం సుందరం (Thirukkurungudi Vengaram Sundaram). దీని వ్యవస్థాపకులు టి.వి. సుందరం అయ్యంగార్ పేరే ఈ కంపెనీ పేరుగా మారింది... టివిఎస్ గా స్థిరపడిపోయింది.
PVR (పివిఆర్)
భారతీయ సినిమాల గురించి అవగాహన ఉన్నవారికి తప్పకుండా PVR గురించి తెలుస్తుంది. ఇది మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహించే ఓ ప్రముఖ సంస్థ... సినిమా నిర్మాణరంగంలోనూ ఉంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో పివిఆర్ థియేటర్స్ కనిపిస్తుంది. ఈ పివిఆర్ అనేది సంక్షిప్త రూపం... దీని అసలు పేరేంటో తెలుసా? ప్రియా విలేజ్ రోడ్ షో.
ప్రియా ఎగ్జిబిటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విలేజ్ రోడ్‌షో లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్‌గా పివిఆర్ ఏర్పడింది. దేశ రాజధాని డిల్లీలోని వసంత్ విహార్ లో ప్రారంభమైన ఈ PVR ప్రస్థానం ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
అముల్ (Amul)
భారతదేశంలో డెయిరీ ఉత్పత్తులు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అముల్. గుజరాత్ కు చెందిన ఈ డెయిరీ సంస్థ దేశవిదేశాల్లో విస్తరించింది. అయితే అముల్ అనేదే ఈ కంపెనీ పేరుగా భావిస్తారు.. కానీ ఇది సంక్షిప్త రూపమే. దీని అసలు పేరు ఆనంద్ మిల్స్ యూనియన్ లిమిటెడ్ (Anand Milk Union Limited).
1946 అంటే దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఈ సంస్థను స్థాపించారు... ఇది దేశంలో శ్వేత విప్లవానికి (పాల ఉత్పత్తి పెరుగుతల) దారితీసింది. అముల్ ఓ కోఆపరేటివ్ సొసైటీ... దీన్ని వర్గీస్ కురియన్ అభివృద్ధి చేశారు.
MRF (ఎంఆర్ఎఫ్)
చిన్న సైకిల్ నుండి పెద్దపెద్ద లారీలు, చివరకు యుద్ద విమానాల టైర్లను కూడా తయారుచేస్తుంది ఎంఆర్ఎఫ్. భారతదేశంలో అతిపెద్ద టైర్ల తయారీ సంస్థ. ఇది కేవలం టైర్లు మాత్రమే కాదు క్రీడా వస్తువులు, పెయింట్స్, టాయ్స్ ని కూడా తయారుచేస్తుంది. దీన్ని మామ్మెన్ మాప్పిల్లై స్థాపించారు.
మనకు ఎంఆర్ఎఫ్ గానే తెలుసు... కానీ ఇది ఆ కంపెనీ షార్ట్ కట్ పేరట. అసలు పేరు మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (Madras Rubber Factory). ప్రస్తుతం ఈ కంపెనీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని యుద్ద విమానాల టైర్లను కూడా తయారుచేస్తోంది.
పేటిఎం (Paytm)
భారతీయులకు మొదట డిజిటల్ పేమెంట్స్ ని పరిచయం చేసిందే పేటిఎం. దీన్ని 2010 లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు. సెల్ ఫోన్ నుండి ఆర్థిక లావాదేవీలు జరిపేలా ఈ యాప్ ను రూపొందించారు. అయితే Paytm అనేది షార్ట్ కట్ పేరు... దీని అసలు రూపం Pay Through Mobile. మొట్టమొదట డిల్లీలో ఈ పేటిఎం సేవలు ప్రారంభమయ్యాయి... అతి తక్కువకాలంలోనే దేశవ్యాప్తంగా పేటిఎం వినియోగం పెరిగిపోయింది.