భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. 5 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ యాక్సెస్
TikTok: 2020లో నిషేధించిన టిక్‌టాక్ వెబ్‌సైట్ భారత వినియోగదారులకు 5 ఏళ్ల తర్వాత మళ్లీ యాక్సెస్ అవుతోంది. అయితే, యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. ఇండియాలోకి రీఎంట్రీ పై ఇంకా అధికారిక సమాచారం లేదు.

టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి రానుందా?
చైనాకు చెందిన షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ (TikTok) మళ్లీ ఇండియాకు రానుందనే చర్చ సాగుతోంది. 2020లో భారత ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో దీనిని నిషేధించింది. అయితే, ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది భారతీయ యూజర్లకు టిక్‌టాక్ వెబ్‌సైట్ మళ్లీ యాక్సెస్ అవుతోంది. ఇది టిక్ టాక్ రీఎంట్రీకి సంకేతమా అన్న చర్చ మళ్లీ మొదలైంది. శుక్రవారం నుంచి పలువురు యూజర్లు ఈ వెబ్‌సైట్ పనిచేస్తోందని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టిక్ టాక్ యాప్ మాత్రం ఇంకా అందుబాటులో లేదు
ప్రస్తుతం భారత్ లో టిక్‌టాక్ వెబ్‌సైట్ మాత్రమే యాక్సెస్ అవుతుండగా, యాప్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో లేదు. కొన్ని రిపోర్టుల ప్రకారం, వెబ్‌సైట్ హోమ్‌పేజ్ ఓపెన్ అవుతున్నా, న్యూస్‌రూమ్ లేదా కెరీర్స్ పేజీలను క్లిక్ చేస్తే సర్వీస్ అందుబాటులో లేదని సందేశాలు కనిపిస్తున్నాయి. టిక్ టాక్ రీఎంట్రీ పై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.
2020లో భారత్ లో టిక్‌టాక్ ను ఎందుకు నిషేధించారు?
2020 జూన్‌లో భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. ఇందులో టిక్‌టాక్, షేర్‌ఇట్, యూసీ బ్రౌజర్, క్యామ్‌స్కానర్ వంటి యాప్‌లు ఉన్నాయి. "భారత సార్వభౌమత్వం, భద్రత, రక్షణ, పబ్లిక్ ఆర్డర్‌కు విరుద్ధంగా యాక్టివిటీల్లో పాల్గొంటున్నాయి" అని కేంద్రం పేర్కొటూ ఈ యాప్ లపై నిషేధం విధించింది.
సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69A, సంబంధిత రూల్స్ ప్రకారం ఈ నిషేధాన్ని అమలు చేసింది.
భారత్-చైనా సంబంధాల పునరుద్ధరణ
ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు పునరుద్ధరణ కోసం చర్చలు జరుగుతున్న సమయంలో టిక్ టాక్ వెబ్ సైట్ యాక్సెస్ అవుతుండటం గమనార్హం. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలపై టారిఫ్‌లు విధించిన తర్వాత, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో భేటీ అయ్యారు. అలాగే SCO సమ్మిట్‌కి మోడీని ఆహ్వానించారు.
చైనా రాయబారి కూడా భారత్‌తో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే టిక్‌టాక్ వెబ్‌సైట్ మళ్లీ ఇండియాలో కనిపించటం గమనార్హం.
అమెరికాలో సంక్షోభంలో టిక్‌టాక్
టిక్‌టాక్‌పై నిషేధం కేవలం భారత్‌లోనే కాదు, అమెరికాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టిక్‌టాక్‌ను అమెరికన్ కంపెనీలు కొనుగోలు చేస్తే నిషేధాన్ని వాయిదా వేయవచ్చని తెలిపారు. మరోవైపు, టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్ తన యూకే ఉద్యోగులను తగ్గిస్తూ, ఆపరేషన్లను AI ఆధారంగా కేంద్రీకరిస్తున్నట్టు ప్రకటించింది.
2017లో బైట్‌డాన్స్ ప్రారంభించిన టిక్‌టాక్, 2020లో భారత్‌లో శాశ్వత నిషేధానిక గురైంది. ఐదు ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ మళ్లీ యాక్సెస్ అవుతున్నా, యాప్ తిరిగి వస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ పరిణామం మళ్లీ భారత వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.