Salary: సీటీసీ, టేక్ హోమ్ శాలరీకి తేడా ఏంటి.? ఎంత సీటీసీకి ఎంత శాలరీ చేతికొస్తుంది.
Salary: చాలామంది ఉద్యోగులు కొత్త ఆఫర్ లెటర్ చూసినప్పుడు CTC చూసి ఆనందపడతారు. కానీ జీతం ఖాతాలో పడే సమయానికి అంచనాలు మారిపోతాయి. కారణం CTCకి, చేతికి వచ్చే జీతానికి మధ్య ఉన్న తేడా. ఇంతకీ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.

CTC అంటే ఏంటి?
CTC అంటే Cost to Company. ఒక ఉద్యోగిపై కంపెనీ ఏడాదికి ఖర్చు చేసే మొత్తం డబ్బు. CTCలో ఉండే అంశాలు.
* బేసిక్ శాలరీ
* హౌస్ రెంట్ అలవెన్స్
* స్పెషల్ అలవెన్స్
* PF (ఉద్యోగి + కంపెనీ వాటా)
* గ్రాట్యుటీ
* ఇన్సూరెన్స్
* బోనస్
అంటే CTC మొత్తం ఉద్యోగి చేతికి వచ్చే డబ్బు కాదు. ఇందులో కొన్ని భాగాలు నేరుగా చేతికి రావు.
టేక్ హోమ్ శాలరీ అంటే ఏంటి.?
Take Home Salary అంటే ప్రతి నెల ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే మొత్తం. CTC నుంచి.. ప్రావిడెంట్ ఫండ్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటివి కట్ అవుతాయి. ఇవన్నీ కట్ అయిన తర్వాత మిగిలేది టేక్ హోమ్ శాలరీ.
ఆదాయం పెరిగితే ట్యాక్స్ ఎందుకు పెరుగుతుంది?
సాధారణంగా 10 లక్షల ప్యాకేజీ (ఏడాదికి)కి ఎలాంటి పన్ను ఉండదు. 15 లక్షల ప్యాకేజీ నుంచి ట్యాక్స్ ప్రారంభమవుతుంది. 25 LPA, 40 LPA దాటితే ట్యాక్స్ భారీగా పెరుగుతుంది. ఇదంతా ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ కారణంగా జరుగుతుంది. జీతం పెరిగిన కొద్దీ ట్యాక్స్ శాతం కూడా పెరుగుతుంది. అందుకే CTC పెరిగినా చేతికి వచ్చే డబ్బు అంతగా పెరగదు.
హై CTC ఉన్నా చేతికి తక్కువ డబ్బు ఎందుకు వస్తుంది?
చాలా మందికి ఉండే సందేహం ఇదే. దీనికి కారణంగా PF కట్ ఎక్కువగా ఉండటం, గ్రాట్యుటీ CTCలో ఉండటం కానీ చేతికి రాకపోవడం, ట్యాక్స్ భారంగా మారటం, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ అవ్వటం. ఉదాహరణగా 1 కోటి CTC ఉన్నా నెలకు చేతికి వచ్చే మొత్తం సుమారు 5.6 లక్షలే. మిగిలిన మొత్తం ట్యాక్స్, ఇతర కట్‌లలో పోతుంది.
ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
ప్రతి ఉద్యోగి ఇవి తప్పకుండా తెలుసుకోవాలి.
* ఆఫర్ లెటర్‌లో CTC బ్రేకప్ చూసుకోవాలి
* టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుందో ముందే లెక్క వేసుకోవాలి
* ట్యాక్స్ ప్లానింగ్ చేయాలి
* PF, గ్రాట్యుటీ లాంటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ విలువ తెలుసుకోవాలి
* జీతం ఎక్కువగా కనిపించడం కన్నా చేతికి వచ్చే డబ్బు ఎంత అన్నదే అసలు విషయం.

