ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా.. బ్యాంకును మూసేస్తున్న ఆర్బీఐ
Karwar Cooperative Bank: కార్వార్ నగర కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేసింది. 92.9 శాతం ఖాతాదారులకు డిపాజిట్ రికవరీ హామీని ఇచ్చింది.

ఆర్బీఐ కీలక నిర్ణయం.. కార్వార్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ కు షాక్ ఇచ్చింది. బుధవారం (జూలై 23, 2025న) కార్వార్ నగర కోఆపరేటివ్ బ్యాంక్‌కు జారీ చేసిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఇది కర్ణాటకలోని కార్వార్ కేంద్రంగా పనిచేస్తున్న నగర, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ బ్యాంక్ గా గుర్తింపు పొందింది.
అయితే, నిర్వహణ లోపాల క్రమంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రకటనలో.. ఈ బ్యాంకు ఆర్థికంగా తీవ్రమైన బలహీనతలు ఎదుర్కొంటోందనీ, ప్రాథమికంగా అవసరమైన మూలధనం, ఆదాయ వనరులు కొనసాగించడంలో విఫలమైందని తెలిపింది.
లైసెన్స్ రద్దుతో పాటు, బ్యాంక్ ఇకపై ఏ రకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశించింది. డిపాజిట్లు స్వీకరించడం, నగదు తీసుకోవడం, లేదా కొత్త రుణాలివ్వడం వంటి అన్ని సేవలూ నిలిపివేశారు.
KNOW
కార్వార్ కోఆపరేటివ్ బ్యాంక్ : ఆర్థిక బలహీనతలే ప్రధాన కారణం
ఆర్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ కోఆపరేటివ్ బ్యాంక్ జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడంలో విఫలమైంది. అవసరమైన మూలధన నిష్పత్తులు లేవు. అలాగే, బ్యాంకు నిలదొక్కుకునే అవకాశాలు లేనట్లు గుర్తించింది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ కొనసాగించడం ప్రజల ప్రయోజనాలకు హానికరమని నిర్ణయించి ఆర్బీఐ (RBI) లైసెన్స్‌ను రద్దు చేసింది.
దీంతో ఖాతాదారులు తమ డిపాజిట్ల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ డిపాజిట్ భద్రతపై హామీ ఇచ్చింది.
కార్వార్ కోఆపరేటివ్ బ్యాంక్ : ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు రక్షణ
ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా భద్రత కల్పించారు. ఆర్బీఐ ప్రకారం సుమారు 92.9% ఖాతాదారులు రూ. 5 లక్షల లోపు డిపాజిట్లను కలిగి ఉన్నారు. వారు పూర్తి మొత్తాన్ని తిరిగి పొందే అర్హత కలిగి ఉన్నారు.
ఇప్పటివరకు, DICGC ద్వారా దాదాపు రూ. 37.79 కోట్లు డిపాజిటర్లకు చెల్లించారు. ఇది ఎక్కువశాతం బాధిత ఖాతాదారులకు తగిన సమయంలో ఆదరణను అందించిందని ఆర్బీఐ వెల్లడించింది. మిగిలిన అర్హత ఉన్న ఖాతాదారులకు తిరిగి చెల్లింపు ప్రక్రియ రాబోయే వారాల్లో కొనసాగుతుందని తెలిపింది.
కార్వార్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు సూచనలు
కార్వార్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దుతో చాలా మంది ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రూ.5 లక్షల వరకు మాత్రమే హామీ ఇవ్వడం కూడా ఖాతాదారులను ఆవేదనకు గురిచేస్తోంది.
చాలా మంది తమ జీవితాంతపు పొదుపు, అత్యవసర నిధులు లేదా భవిష్యత్ ప్రణాళికల కోసం డబ్బును ఈ బ్యాంకులో దాచుకున్నారు. చాలా మంది ఈ ప్రాంతీయ బ్యాంకును సంవత్సరాలుగా నమ్ముతూ పెద్ద మొత్తంలో జమచేశారు.
ఖాతాదారుల ఆందోళన మధ్య ఆర్బీఐ ఖాతాదారులను భయపడవద్దని సూచించింది. డిపాజిట్ రికవరీ కోసం DICGC అధికారిక వెబ్‌సైట్ నుండి క్లెయిమ్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, బ్యాంక్ లిక్విడేషన్ అధికారుల నుంచి మరిన్ని సూచనల కోసం వేచి ఉండాలని కోరింది.
కోఆపరేటివ్ బ్యాంకులు కూలుతున్నాయి.. ఎందుకు?
ఈ సంఘటన, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో పనిచేస్తున్న కోఆపరేటివ్ బ్యాంకుల స్థిరత్వంపై మరోసారి ప్రశ్నలు వేస్తోంది. ఇటీవల కోఆపరేటివ్ బ్యాంకులు కూలడంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఖాతాదారులు తమ బ్యాంక్ ఆర్థిక స్థితి పట్ల అవగాహన కలిగి ఉండాలనీ, ఆర్బీఐ పబ్లిక్ నోటిఫికేషన్లను అనుసరించాలనే హెచ్చరికలను గుర్తు చేస్తున్నాయి.