రిటైర్మైంట్ తర్వాత లైఫ్ బిందాస్‌గా ఉండాలా.? ఏ పని చేయకుండా ప్రతీ నెల రూ. 20 వేలు..
Post office: పదవి విరమణ తర్వాత ప్రతీ నెల స్థిర ఆదాయం ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే పెన్షన్ వస్తుంది. మరి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి.? ఇలాంటి వారి కోసమే పోస్టాఫీస్‌లో ఒక మంచి పథకం అందుబాటులో ఉంది.

పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయం
ఉద్యోగ జీవితానికి ముగింపు పలికిన తర్వాత చాలా మంది నిరంతర ఆదాయం ఉండాలని కోరుకుంటారు. నెలవారీ ఖర్చులకు డబ్బు ఉండాలని ఆశిస్తుంటారు. ఈ సమయంలో భద్రతతో పాటు మంచి రాబడిని ఇచ్చే పెట్టుబడి వైపు మొగ్గు చూపుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అత్యంత విశ్వసనీయమైన ఎంపికగా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడిచే పథకం కావడంతో డబ్బు పూర్తిగా భద్రంగా ఉంటుంది.
ఈ పథకంలో ఎవరు చేరవచ్చు?
ఈ పథకాన్ని ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం రూపొందించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్నా, వారు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. రక్షణ విభాగానికి చెందిన సిబ్బంది అయితే 50 సంవత్సరాల వయస్సు నుంచే ఖాతాను ప్రారంభించవచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ రూపంలో ఈ పథకం ప్రారంభించవచ్చు.
వడ్డీ రేటు, రాబడి వివరాలు
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ SCSS పథకంపై 8.2% వార్షిక వడ్డీ అందిస్తున్నారు. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్ల కంటే ఎక్కువ అని చెప్పాలి. ఉదాహరణకు.. ఒక పెట్టుబడిదారుడు రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, ఆయనకు ప్రతి సంవత్సరం రూ.2.46 లక్షలు వడ్డీ వస్తుంది. అంటే నెలకు దాదాపు రూ.20,500 ఆదాయం వడ్డీ రూపంలో లభిస్తుంది.
పెట్టుబడి పరిమితులు, కాలపరిమితి
ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్టంగా రూ.30 లక్షలు వరకు పెట్టుబడి చేయవచ్చు. స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా, అవసరమైతే దాన్ని మరిన్ని 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. వడ్డీ ప్రతి త్రైమాసికం చెల్లిస్తారు. అంటే మీ ఆదాయం నిరంతరంగా వస్తూనే ఉంటుంది.
పన్ను రాయితీలు, భద్రతా అంశాలు
SCSS పథకంలో పెట్టుబడి చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీ లభిస్తుంది. అయితే పొందే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. ఈ స్కీమ్ ప్రభుత్వ హామీతో నడుస్తుండటంతో, పెట్టుబడి పూర్తిగా సురక్షితమని చెప్పవచ్చు. పదవీ విరమణ తర్వాత నెలవారీ ఖర్చులు సులభంగా నిర్వహించుకునేందుకు ఇది ఒక స్థిరమైన ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది.