- Home
- Business
- PF Withdrawal Card పీఎఫ్ విత్‌డ్రా కార్డు: ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు.. ఖాతాదారులకు పండగే ఇక!
PF Withdrawal Card పీఎఫ్ విత్‌డ్రా కార్డు: ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు.. ఖాతాదారులకు పండగే ఇక!
మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఎప్పుడంటే అప్పుడు, ఎంత మొత్తం అనుకుంటే అంత మొత్తం తేలికగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఏటీఎం కార్డు ఉంటుంది. కానీ పీఎఫ్ ఖాతా (PF Account)లో డబ్బులు తీసుకోవాలంటే ఎంతో కష్టం. ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికోసం బ్యాంకు ఖాతా వివరాలు, చిరునామా సమర్పించాలి. వారం నుంచి 15 రోజులు ఎదురు చూడాలి. అదీ తప్పకుండా వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి ప్రయాసకు త్వరలోనే చెక్ పడనుంది. అచ్చం బ్యాంకు ఏటీఎం (ATM)లాగే డబ్బులు తీసుకునే కార్డు త్వరలోనే అందుబాటులోకి రానుంది.

పీఎఫ్ విత్‌డ్రా కార్డు
ఇక డబ్బులు తీసేందుకు మీ చేతికి ఒక కార్డు రానుంది! ఈ కార్డుతో ఎప్పుడైనా ఏటీఎం నుంచి పీఎఫ్ ఖాతా (PF Account) డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ గతంలోనే చెప్పింది. జూన్ నెల నుంచే ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.
రాబోయే జూన్ నెల తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికీ ఒక కార్డు ఇస్తుంది. ఆ కార్డులు చూడటానికి ఏటీఎం కార్డుల్లాగే ఉంటాయి. ఆ కార్డుతో ఎప్పుడైనా ఏటీఎం నుంచి పీఎఫ్ ఖాతా డబ్బులు తీసుకోవచ్చు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏటీఎం నుంచి పీఎఫ్ ఖాతాలో 50 శాతం డబ్బులు తీసుకోవచ్చు.
డిజిటలైజేషన్, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఈ విధానాన్ని అభివృద్ధిని చేశామని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కో లావాదేవీకి ఎంత డబ్బు తీసుకోవచ్చు, డబ్బులు తీసుకునే గరిష్ఠ పరిమితి ఎంత? తదితర విధివిధానాలు ఇంకా ప్రకటించలేదు. అంతేకాదు, ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ విత్‌డ్రాయల్ కార్డు డెబిట్ కార్డులా కూడా పని చేస్తుంది. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ ఈ విత్‌డ్రాయల్ కార్డు ఇస్తారని సమాచారం.