Cabs: మీరు కూడా క్యాబ్ సేవలు ఉపయోగిస్తారా.? అయితే మీకో బ్యాడ్ న్యూస్
ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన క్యాబ్ సేవలు ప్రస్తుతం చిన్న సిటీలకు కూడా విస్తరించాయి. దేశంలో వేలాది మంది ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా ఎంతో మందికి ఈ రంగం ఉపాధిని కల్పిస్తోంది.

పెరగనున్న ఛార్జీలు
ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో ఓలా, ఊబర్ వంటి రైడ్ సేవల ఛార్జీలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇటీవల ప్రకటించిన కొత్త మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాల ప్రకారం, పీక్ అవర్స్‌లో క్యాబ్ ఛార్జీలు రెట్టింపయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను సెప్టెంబర్ లోగా అమలు చేయాల్సిందిగా సూచించింది.
పీక్ టైమ్‌లో ఛార్జీలు రెట్టింపు
కొత్త నిబంధనల ప్రకారం, గరిష్ట రద్దీ సమయంలో (peak hours), క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీకి రెట్టింపు వరకు వసూలు చేయవచ్చు. ఇప్పటివరకు ఇది 1.5 రెట్లు ఉండగా, ఇప్పుడు 2 రెట్లుగా పెరగనుంది. అదే సమయంలో రద్దీ లేని సమయాల్లో కనీసంగా బేస్ ఫేర్‌కు 50% ఛార్జీ మాత్రమే వసూలు చేయాలి.
బేస్ ఫేర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది
బేస్ ఫేర్ ఎంత ఉండాలి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వెహికిల్ టైప్ ఆధారంగా ఒక్కొక్క రేటు ఉంటుంది. బేస్ ఫేర్ కనీసం 3 కిలోమీటర్ల దూరానికి వర్తిస్తుంది. ఇది డ్రైవర్ పికప్ లొకేషన్‌కు వచ్చే ఖర్చును (డెడ్ మైలేజ్) కవర్ చేయడానికే.
డ్రైవర్లకు ఇలా చెల్లింపు
డ్రైవర్లకు చెల్లింపులో స్పష్టత కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఒకవేళ వాహనం డ్రైవర్‌దే అయితే ఫేర్‌లో కనీసం 80% డ్రైవర్‌కు, మిగతా భాగం అగ్రిగేటర్‌కు దక్కుతుంది. అదే వాహనం అగ్రిగేటర్‌దే అయితే డ్రైవర్‌కు 60%, మిగతా 40% అగ్రిగేటర్‌కు దక్కుతుంది. చెల్లింపులు రోజు, వారం లేదా 15 రోజులకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది.
రైడ్ క్యాన్సిలేషన్‌పై కొత్త జరిమానాలు
వినియోగదారులు, డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు జరిమానాలు విధిస్తారు. డ్రైవర్ సరైన కారణం లేకుండా రైడ్ రద్దు చేస్తే ధరలో 10% లేదా గరిష్టంగా రూ. 100 జరిమానా విధిస్తారు. ఒకవేళ ప్రయాణికుడు రద్దు చేస్తే కూడా అదే జరిమానా వర్తిస్తుంది. దీని వల్ల ప్రయాణాల ఖచ్చితత్వం మెరుగవుతుంది, ప్రయాణికులకు ఆటంకం తక్కువగా ఉంటుంది.
వీటి అసలు ఉద్దేశం ఏంటంటే.?
ఈ మార్గదర్శకాల వెనుక ఉద్దేశం.. డ్రైవర్లకు న్యాయమైన ఆదాయం కల్పించడం. పీక్ టైమ్‌లో ప్రయాణాల కోసం అందుబాటులో ఉన్న క్యాబ్‌లను ప్రోత్సహించడం. భద్రతా ప్రమాణాలు, వ్యాపార పారదర్శకతతో పాటు సమర్థవంతమైన సేవలు అందించడంపై దృష్టి పెట్టడం.