Reliance : ముఖేష్ అంబానీ జేబులో ఎంత డబ్బుంటుంది? పర్సులో ఉండే కార్డులెన్ని?
Reliance అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడు. ఇలా లక్షలకోట్ల ఆస్తిపాస్తులు కలిగిన ఆయన నిత్యం జేబులో ఎంత డబ్బు పెట్టుకుంటారు? పర్సులో ఎన్ని కార్డులు ఉంటాయి?

అంబానీ మామ పర్స్ సీక్రెట్
Mukesh Ambani : ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా పేమెంట్స్ పెరిగిపోయాయిగానీ గతంలో ప్రతిఒక్కరు జేబులో డబ్బులు లేకుండా బయటకు వెళ్లేవారుకాదు. చాలామంది చక్కటి పర్స్... అందులో డబ్బులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర ముఖ్యమైన కార్డులు, చిన్నచిన్న పత్రాలను పెట్టుకునేవారు. ఇలా సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరికి పర్స్ ను వాడే అలవాటు ఉండేది. ఇప్పటికీ కొందరు పర్స్ వాడుతుంటారు.
అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు... భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. కేవలం అంబానీ కుటుంబం నివాసముండే యాంటిలియా విలువ రూ.16,640 కోట్లు. ఆయన రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తే భద్రతా సిబ్బంది రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లలో కాన్వాయ్‌గా వస్తారు. ఇంత విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ పర్సు వాడతారా? అందులో ఎంత నగదు ఉంటుంది? సామాన్యులలాగే ప్రతిసారి తన అవసరాలకు ఈ పర్సులో డబ్బులనే వాడతారా? అనే అనుమానం చాలామందికే ఉండిఉంటుంది. అయితే ముఖేష్ అంబానీ బయటకు వెళ్లినపుడు ఎలా ఖర్చు చేస్తారో తాజాగా బైటపెట్టారు.
అంబానీ పర్సులో ఎంత డబ్బుంటుంది?
ఒక ఇంటర్వ్యూలో ముఖేష్ అంబానీ తన పర్సులోని డబ్బు గురించి మాట్లాడారు. డబ్బు ఒక వనరు మాత్రమే... దాన్ని ఉపయోగించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటా... కానీ వ్యక్తిగతంగా తనకు డబ్బే సర్వస్వం కాదన్నారు. అసలు తాను పర్సు వాడను... జేబులో డబ్బు కూడా ఉండదని ముఖేష్ అంబానీ తెలిపారు.
ముఖేష్ అంబానీ చెల్లింపులు ఎలా చేస్తారు?
ముఖేష్ అంబానీ బయటకు వెళ్లినపుడు ఎక్కడైనా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటే వెంటవుండే సిబ్బంది లేదా సెక్రటరీ చూసుకుంటారు. గుడికి వెళ్లినా, విరాళం ఇవ్వాలన్నా ముందే నిర్ణయించుకుని డబ్బు లేదా చెక్కు సిద్ధం చేసుకుంటానని ముఖేష్ అంబానీ తెలిపారు.
స్కూల్ డేస్ లో అంబానీ వద్ద ఎంత డబ్బుండేది?
స్కూల్ రోజుల్లోనూ చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగివుండేవాడినని... నాన్న ధీరూభాయ్ అంబానీ ద్వారా ఇది అలవర్చుకున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లేటప్పుడు నాన్న అస్సలు డబ్బులు ఇచ్చేవారు కాదన్నారు. అప్పట్లో జేబులో డబ్బు ఉండాలనే ఆలోచన కూడా ఉండేది కాదు... ఇలా క్రమశిక్షణ అలవాటైందన్నారు. అందుకే స్కూల్, కాలేజీ రోజుల్లోనూ పర్సు వాడలేదని... ఎప్పుడూ జేబులో డబ్బులు ఉంచుకోలేదని ముఖేష్ అంబానీ చెప్పారు.
అంబానీకి అది అస్సలు నచ్చదట...
తనకు ఎప్పుడూ బయట కనిపించాలని ఉండదు... మరీముఖ్యంగా మీడియా అంటే అస్సలు ఇష్టం లేదని ముఖేష్ అంబానీ చెప్పారు. మీడియా తనను బిలియనీర్, కోటీశ్వరుడు అని పిలవడం నచ్చదన్నారు. తాను సాధారణ వ్యక్తిలా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు. కొన్ని పరిమితులు ఉన్నా, మిగతా విషయాల్లో సాధారణ వ్యక్తిలానే ఉంటానని ముఖేష్ అంబానీ తెలిపారు.