ITR Filing: మీ ఆదాయం తక్కువగా ఉన్నా ITR ఫైల్ చేయాలి. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ITR Filing: వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. తక్కువ ఆదాయం ఉన్నా, ఐటీఆర్ ఫైల్ చేయడం వలన రుణాలు పొందడం, వీసా దరఖాస్తు చేసుకోవడం వంటి వాటికి ఉపయోగపడుతుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడం అవసరం
ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. దీన్నే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) దాఖలు చేయడం అంటాం. చాలా మంది తాము పన్ను పరిధిలోనే ఉన్నానని తెలుసుకుంటారు. కాని కట్టడం మాత్రం చేయరు. అయితే కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం అవసరం అవుతుంది.
ఎంత ఆదాయం ఉంటే ఐటీఆర్ కట్టాలి
భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎంత ఆదాయం సంపాదించే వారు ఐటీఆర్ దాఖలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- సాధారణ వర్గం (60 ఏళ్లలోపు): సంవత్సరానికి రూ.2,50,000 కంటే ఎక్కువ ఆదాయం
- సీనియర్ సిటిజన్లు (60-80 ఏళ్లు): రూ.3,00,000 కంటే ఎక్కువ ఆదాయం
- అతి సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు): రూ.5,00,000 కంటే ఎక్కువ ఆదాయం
- కొత్త పన్ను విధానంలో: రూ.3,00,000 కంటే ఎక్కువ (అందరికీ సమానం)
- ఈ ఆదాయాలు సంపాదించే వారంతా ఐటీఆర్ దాఖలు చేయాలి.
వీల్లంతా ITR దాఖలు చేయాలి
TDS (మూలం వద్ద పన్ను మినహాయింపు) పొందినవారు
బ్యాంక్ వడ్డీ, FD, జీతం వంటి వాటిపై TDS మినహాయింపు పొందినట్లయితే, ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి ఐటీఆర్ దాఖలు చేయడం అవసరం.
వ్యాపారం, స్వయం ఉపాధి పొందే వారు
వ్యాపారం, ఉద్యోగం, స్వయం ఉపాధి (ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ) చేసే వ్యక్తులు, ఎంత ఆదాయం ఉన్నా ఐటీఆర్ దాఖలు చేయాలి.
విదేశీ ఆస్తులు లేదా బ్యాంక్ ఖాతా ఉన్నవారు
విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నవారు లేదా అక్కడ బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నవారు ఐటీఆర్ దాఖలు చేయాలి.
విద్యుత్తు ఖర్చు రూ.లక్ష దాటిన వాళ్లు కూడా..
రూ.1 కోటికి పైగా బ్యాంక్ లావాదేవీలు
ఒక వ్యక్తి తన పొదుపు లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేసినట్లయితే ఐటీఆర్ దాఖలు చేయాలి.
విదేశీ ప్రయాణ ఖర్చులు రూ.2 లక్షలకు పైగా
ఒక వ్యక్తి లేదా అతని తరఫున ఎవరైనా విదేశీ ప్రయాణానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే ఐటీఆర్ దాఖలు చేయడం అవసరం.
విద్యుత్తు ఖర్చు రూ.1 లక్షకు పైగా
ఒక వ్యక్తి ఇంటి విద్యుత్తు ఖర్చు సంవత్సరానికి రూ.1 లక్ష దాటిన వారు కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి.
బ్యాంకు రుణాలు పొందాలంటే రిటర్న్ తప్పనిసరి
చాలా సందర్భాల్లో ఐటీఆర్ దాఖలు చేయడం ముఖ్యమైన ఆధారంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- బ్యాంక్ రుణాలు (హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్) పొందడానికి
- వీసా దరఖాస్తులు
- ఎక్కువ విలువైన పెట్టుబడులు (షేర్లు, భూమి, నగదు లావాదేవీలు)
- సరైన ఆదాయ రుజువు (ఇన్‌కమ్ ప్రూఫ్)
- TDS తిరిగి పొందినవాళ్లు (రిఫండ్)
రూ.2.5 లక్షల లోపు ఉంటే..
- మీ ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉంటే పన్ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- బ్యాంక్‌లో TDS మినహాయింపు పొందడానికి ఫారమ్ 15G/H ఉపయోగించవచ్చు.
- వృద్ధులు, విద్యార్థులు, మైనర్లు పెట్టుబడి ఆదాయాన్ని చూపించవచ్చు.
- భవిష్యత్తులో రుణం కోసం రుజువు లేదా ఐటీఆర్ చరిత్ర ఏర్పడుతుంది.
ITR ఫైలింగ్ తో లాభమే కాని నష్టం ఉండదు
ఐటీఆర్ దాఖలు చేయడం అంటే కేవలం పన్ను కట్టడమే కాదు.. ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం. అందుకే ఆదాయ పరిమితిని మించితే తప్పనిసరిగా దాఖలు చేయాలి. అంతేకాకుండా మీ నగదు లావాదేవీలు, వీసా అవసరాలు, రుణ అవసరాలకు ఇది గొప్ప రుజువుగా ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్నా ఐటీఆర్ ఫారమ్ దాఖలు చేయండి. ప్రయోజనమే తప్ప నష్టం ఉండదు.