Laptop Companies బైబై చైనా.. ల్యాప్‌టాప్ కంపెనీలు ఇండియాకి క్యూ!
భారత్ బాట: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ అంటే వెంటనే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచ దిగ్గజ కంపెనీల మాన్యఫాక్చరింగ్ కంపెనీల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల గురించి ఇంక చెప్పనే అక్కర్లేదు. కానీ కొన్నాళ్లుగా ఆ దిగ్గజ కంపెనీలు చైనాకు బదులుగా భారత దేశం బాట పడుతున్నాయి. మన దగ్గరే ల్యాప్‌టాప్ తయారీ యూనిట్లు తెరుస్తున్నాయి. దానికి కారణమేంటో మీరు తెలుసుకోవాల్సిందే.

మేడ్ ఇన్ ఇండియా
ASUS, HP, MSI లాంటి ల్యాప్ టాప్ ల తయారీ కంపెనీలు ఈమధ్యకాలంలో భారత్ లో తయారీ యూనిట్లు ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? ప్రభుత్వం ప్రారంభించిన ఇండియా PLI 2.0 పథకం.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
PLI 2.0 పథకం కింద భారత ప్రభుత్వం దేశంలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు 5% వరకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనివల్ల కంపెనీలకు స్థానిక తయారీలో లాభం చేకూరుతుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు..లాంటి ప్రొడక్షన్ లింక్డ్ డివైజ్ లకు ప్రభుత్వం మంచి ప్రోత్సాకాలు అందిస్తోంది. ఇప్పటికే రూ.17వేల కోట్లు అందించింది కేంద్రప్రభుత్వం.
అమెరికా-చైనా ఉద్రిక్తత
ట్రంప్ సుంకాల కారణంగా చైనాలో తయారైన వస్తువులపై అత్యధిక పన్నుల భారం పడనుంది. దీన్ని ముందే గ్రహించిన కంపెనీలు నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ఫ్యాక్టరీలను తెరవడం ప్రారంభిస్తున్నాయి. భారతదేశాన్ని 'సురక్షితమైన స్థావరం'గా భావిస్తున్నాయి.
ఇండియాలో తయారీ కొత్త కేంద్రాలు
ASUS మానేసర్ యూనిట్ ప్రతి 4 నిమిషాలకు ఒక ల్యాప్‌టాప్‌ను తయారు చేస్తోంది. HP, డిక్సన్, MSI కూడా పెద్ద యూనిట్లను ప్రారంభించాయి. స్థానిక తయారీ ద్వారా కంపెనీలు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనవచ్చు - ఇది వారికి పెద్ద ప్రయోజనం చేకూర్చుతుంది.
సవాళ్లు కూడా ఉన్నాయి
ప్రస్తుతం ల్యాప్‌టాప్ ల తయారీకి కేంద్రాలను భారత్ ఆకర్షిస్తున్నా.. ఇక్కడ కొన్ని సవాళ్లు లేకపోలేదు. భారతదేశంలో ఇప్పటికీ ల్యాప్‌టాప్ ఎగుమతికి అవసరమైన పరీక్షా ప్రయోగశాలలు లేవు. అనేక కంపెనీలు పరీక్ష కోసం ఉత్పత్తులను చైనాకు పంపుతున్నాయి. చైనాతో పోలిస్తే సుశిక్షితులైన మానవ వనరులు మనదగ్గర తక్కువే. ఈ సవాళ్లను దాటితే, అడ్డంకులు తొలగిపోతే, భారతదేశం కొన్నేళ్లలోనే ప్రపంచంలోని తదుపరి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారవచ్చు.