జియో మరో సంచలనం, అందుబాటులోకి VoNR సేవలు.. ఏంటీ టెక్నాలజీ, ఎలా పనిచేస్తుంది?
టెలికం రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. VoNR పేరుతో కొత్త సేవలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంతకీ VoNR అంటే ఏంటి.? ఎలా పని చేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రిలయన్స్ జియో టెలికం రంగంలో సరికొత్త విప్లవానికి తెర తీసిన విషయం తెలిసిందే. టెలికం కంపెనీలకు ధీటుగా అన్ లిమిటెడ్ కాల్స్, ఓటీటీతో సహా అనేక ఆకర్షణీయమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే జియో తాజాగా యూజర్ల కోసం VoNR టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
VoNR సేవ అంటే..
జియో తీసుకొచ్చిన VoNR సేవలతో పోటీదారుల గుండెల్లో భయం మొదలైంది. కోట్లాది మంది యూజర్లకు ఈ సేవల ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఈ అధునాతన టెక్నాలజీ కాల్స్ లో ఉపయోగపడుతుంది. జియో 5జీ సేవలు ఉపయోగిస్తున్న వారందరికీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం దేశంలో అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు VoLTE (వాయిస్ ఓవర్ LTE) సాంకేతికతను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. జియో కూడా ఇప్పటి వరకు ఇదే సేవలను అందించింది. అయితే తాజాగా 5జీ యూజర్ల కోసం VoNR టెక్నాలజీ ద్వారా సేవలను అందిస్తోంది.
VoLTEతో పోలిస్తే VoNR నాణ్యత మెరుగ్గా ఉంటుంది ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసే సమయంలో అనవసర శబ్దాలు మీకు వినిపించవు. మాట్లాడే వ్యక్తి వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆడియో HD నాణ్యతతో వినిపిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీతో కాల్స్ నాణ్యత పెరుగుతుందన్నమాట.
దీంతో పాటు ఈ సరికొత్త టెక్నాలజీతో నెట్‌వర్క్, కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ సమస్యలు ఉండవు. నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నా కాల్‌లో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది VoNR టెక్నాలజీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇప్పుడు జియో 5G వినియోగదారులు VoNR టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
జియో కొత్త సాంకేతికతతో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, BSNL కంపెనీలకు గట్టి దెబ్బ పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టెక్నాలజీ అందిస్తున్న మొదటి కంపెనీగా జియో నిలిచింది. కాగా త్వరలోనే ఇతర కంపెనీలు సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.