Train: ఇకపై రైళ్లలో ఏటీఎమ్‌లు.. ప్రారంభించిన రైల్వే అధికారులు
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత పెరుగుతున్నా మరోవైపు నగదు లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఏటీఎమ్‌లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఒక్కడో ఒక చోట కనిపించే ఏటీఎమ్‌లు ఇప్పుడు ప్రతీ వీధిలో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా ఏకంగా రైళ్లలో ఏటీఎమ్ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కోసం రైల్వేశాఖ 'ఏటీఎమ్ ఆన్ వీల్స్' అనే కాన్సెప్ట్‌పై కసరత్తు చేస్తోంది.

atm train
మనం ఇప్పటి వరకు ఏటీఎమ్‌లను షాపింగ్ మాల్స్‌లో, ప్రత్యేక సెంటర్లలో, బ్యాంకుల్లో చూసి ఉంటాం. అయితే ఇకపై నడిచే రైళ్లలో కూడా ఏటీఎమ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు రైల్వే శాఖ “ATM on Wheels” కాన్సెప్ట్‌పై కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో సెంట్రల్ రైల్వే ఓ ప్రత్యేక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే ముంబయి-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ లో తొలి సారిగా ఓ ప్రైవేట్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా ఈ ఏటీఎమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం యూనిట్‌ను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో అమర్చారు. రైలు కదులుతున్నప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా షట్టర్ డోర్ అమర్చారు. దీనికి అనుగుణంగా మన్మాడ్ వర్క్‌షాప్‌లో కోచ్‌లో కొన్ని మార్పులు చేశారు.
atm train
పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (CSMT) నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు నడుస్తుంది. సుమారు 4.30 గంటల ప్రయాణం కలిగిన ఈ రైలు ఆ మార్గంలో ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే రైలును ప్రయోగాత్మకంగా ATM ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, రైల్వే శాఖ మిగతా ముఖ్యమైన మార్గాల్లోనూ ATM సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది.
atm train
రైళ్లలో ATM సదుపాయం ఉండటం వల్ల ప్రయాణికులు నగదు అవసరాలు తేలికగా తీర్చుకోగలుగుతారు. ఇదే కాకుండా ఇది బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా మాట్లాడుతూ.. 'ఇది ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన విధానం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాం' అని తెలిపారు.