ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ ఎప్పుడు? గడువు పొడిగించారా?
ITR Filing Deadline: ఆదాయపన్ను శాఖ ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 15కే పరిమితం చేసింది. ఐటీఆర్ గడువు పొడిగింపు పై వస్తున్న వార్తలను ఖండించింది. నెటిజన్ల ఫిర్యాదులు వచ్చినా, గడువు పొడిగింపు వుండదని స్పష్టం చేసింది.

ఐటీఆర్ ఫైలింగ్ రష్.. గడువు పై నెటిజన్ల ఫిర్యాదులు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు గడువు పొడిగించారని వస్తున్న వార్తలపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ఆలాంటి వార్తలను ఖండిస్తూ ఐటీఆర్ దాఖలు గడువులో ఎలాంటి పొడిగింపులు చేయలేదని స్పష్టం చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు సెప్టెంబర్ 15తో ముగుస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
సెప్టెంబర్ 15 ఆదాయపన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసేందుకు చివరి తేదీ కావడంతో, ఆదాయపన్ను శాఖ పోర్టల్ లో భారీ ట్రాఫిక్ నమోదైంది. చాలా మంది నెటిజన్లు లాగిన్ సమస్యలు, టాక్స్ పేమెంట్ గ్లిచ్‌లు, AIS డౌన్‌లోడ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ సమస్యలపై స్పందించారు.
ఆదాయపన్ను రిటర్న్స్ (ITR) దాఖలు గడువు పొడిగింపు లేదు
ఆదాయపన్ను శాఖ తన అధికారిక X హ్యాండిల్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. “ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించారని వస్తున్న సమాచారంలో నిజం లేదు. ఇది తప్పుడు సమాచారం. చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గానే ఉంటుంది” అని స్పష్టం చేసింది. CBDT గడువును సెప్టెంబర్ 30కి మార్చిందన్న వార్తను "ఫేక్" అని కొట్టిపారేసింది. పన్ను చెల్లింపుదారులు అధికారిక @IncomeTaxIndia అప్‌డేట్స్‌పై మాత్రమే ఆధారపడాలని సూచించింది.
A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.
✅ The due date for filing ITRs remains 15.09.2025.
Taxpayers are advised to rely only on official… pic.twitter.com/F7fPEOAztZ— Income Tax India (@IncomeTaxIndia) September 14, 2025
ఆదాయపు పన్ను శాఖ ఏం చెప్పింది?
ఐటీ శాఖ తెలిపిన ప్రకారం పోర్టల్ సాధారణంగానే ఇబ్బంది లేకుండా పనిచేస్తోంది. యూజర్లు సమస్యలు ఎదుర్కొంటే బ్రౌజర్ క్యాచ్ లను క్లియర్ చేయాలని లేదా వేరే బ్రౌజర్ ద్వారా ప్రయత్నించాలని సూచించింది. ఇంకా సమస్యలు కొనసాగితే PAN, మొబైల్ నంబర్‌తో పాటు వివరాలను orm@cpc.incometax.gov.in కి పంపాలని కోరింది. AIS/TIS డౌన్‌లోడ్ సమస్యలపై కూడా సహాయం కోసం cmcpc_support@insight.gov.in మెయిల్ ఐడీ అందుబాటులో ఉందని పేర్కొంది.
ఐటీఆర్ ఫైలింగ్ లెక్కలు ఎలా ఉన్నాయి?
సెప్టెంబర్ 13 మధ్యాహ్నం వరకు 6 కోట్లకుపైగా రిటర్న్స్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2024-25 అంచనా సంవత్సరానికి (AY 2025-26) గడువు వరకు ఇంకా లక్షలాది రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉందని తెలిపింది. గత సంవత్సరం జూలై 31 వరకు 7.28 కోట్ల రిటర్న్స్ నమోదయ్యాయి. 2023-24 అంచనా సంవత్సరంతో పోల్చితే 7.5% వృద్ధి జరిగింది.
ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ
మొదటగా ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31, 2025గా నిర్ణయించారు. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఐటీఆర్ ఫారమ్‌లలో జరిగిన నిర్మాణాత్మక మార్పుల కారణంగా గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఆ మార్పులకు అనుగుణంగా ఫైలింగ్ యుటిలిటీలను, బ్యాక్‌ఎండ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. చిన్న, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీలు జూన్‌లో అందుబాటులోకి వచ్చాయి. జూలైలో ఐటీఆర్-2 కూడా ప్రారంభించారు.
24x7 సపోర్ట్ అందిస్తున్న ఆదాయపు పన్ను శాఖ
ఆదాయపు పన్ను శాఖ హెల్ప్‌డెస్క్ 24 గంటలు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. కాల్స్, లైవ్ చాట్, వెబెక్స్ సెషన్స్, సోషల్ మీడియా ద్వారా సహాయం అందిస్తామని పేర్కొంది. చివరి నిమిషం రద్దీని తప్పించుకోవడానికి ఐటీ రిటర్న్స్ వెంటనే ఫైల్ చేయాలని పన్ను చెల్లింపుదారులను కోరింది.