Credit Card: క్రెడిట్ కార్డును గూగుల్‌పే, ఫోన్‌పేకి ఎలా లింక్ చేసుకోవాలో తెలుసా.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
దేశంలో డిజిటల్ లావాదేవీలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జేబుల్లో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య తగ్గుతోంది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా రకరకాల మొబైల్ వ్యాలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే యూపీఐ సేవలను మరింత ప్రోత్సహించే క్రమంలో యాప్స్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు.

యూపీఐ పేమెంట్స్ చేసే సమయంలో మన సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతానే విషయం తెలిసిందే. అందుకే యూపీఐ యాప్‌లో రిజిస్టర్ చేసుకునే సమయంలో మన డెబిట్ కార్డును ఉపయోగిస్తుంటాం. అయితే యూపీఐ సేవలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.

అయితే కేవలం రూపే కార్డు ఉన్న వారు మాత్రమే దీనికి అర్హులు. ప్రస్తుతం దాదాపు అన్ని రకాల బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి రూపే క్రెడిట్ కార్టులను అందిస్తాయి. క్రెడిట్ కార్డును మీ యూపీఐకి ఎలా లింక్ చేసుకోవాలో అర్థం కావడం లేదా? గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌కి క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Google Pay Logo
గూగుల్ పేలో ఎలా చేసుకోవాలంటే?
* ఇందుకోసం ముందుగా గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేయాలి.
* ఆ తర్వాత మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేసింది. మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* అందులో కనిపించే ‘యాడ్ రూపే క్రెడిట్ కార్డ్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
* అనంతరం మీ కార్డుపై ఉండే సీవీ నెంబర్, ఎక్సైరీ డేట్, కార్డు నెంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
* వెంటనే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే చాలు క్రెడిట్ కార్డు యూపీఐ యాక్టివేట్ అవుతుంది.
* దీంతో ఇకపై మీరు గూగుల్ పే ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ క్రెడిట్ కార్డు నుంచి కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.

Phone pay
ఫోన్ పేలో ఎలా యాడ్ చేసుకోవాలంటే.?
* ముందుగా మీ ఫోన్‌లో ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేయండి.
* అనంతరం మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
* అందులో కనిపించే 'రూపే ఆన్ యూపీఐ' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
* యాడ్ కార్డ్ ఆప్షన్‌ను క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* వెంటనే మీ కార్డు యాడ్ అవుతుంది.
* ఆ తర్వాత యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ కార్డు వివరాలను అందించాల్సి ఉంటుంది.