- Home
- Business
- UPI : మీరు గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? మరో మూడ్రోజుల్లో అంతా మారిపోతుంది, జాగ్రత్తగా వాడుకొండి
UPI : మీరు గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? మరో మూడ్రోజుల్లో అంతా మారిపోతుంది, జాగ్రత్తగా వాడుకొండి
ఆగస్ట్ 1, 2025 నుండి అంటే ఇంకో మూడ్రోజుల తర్వాత యూపీఐ కొత్తరూల్స్ అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు చాలా జాగ్రత్తగా కొన్ని సేవలను వాడుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

యూపిఐ రూల్స్ చేంజ్
UPI : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో గేమ్ చేంజర్ గా నిలిచింది ఈ UPI (Unified Payments Interface). ఇప్పుడు స్మార్ట్ పోన్, బ్యాంక్ అకౌంట్ కలిగివున్న ప్రతిఒక్కరూ యూపిఐ యాప్స్ గూగుల్ పే, పోన్ పే ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు... దీంతో బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. చివరకు కూరగాయలు కొనాలన్నా యూపిఐ యాప్స్ వాడుతున్నారంటే వీటిని ఏస్థాయిలో వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐలో కీలక మార్పులు రానున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ నుండి ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి, సర్వర్ లోడ్‌ను తగ్గించడానికి ఇండియన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కొత్త నియమాలను అమలు చేసేందుకు సిద్దమయ్యింది. వీటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
1. బ్యాలెన్స్ చెకింగ్ పై పరిమితి
యూపిఐ యాప్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బుందో తెలుసుకోవచ్చు... ఇంతకాలం ఎన్నిసార్లయినా బ్యాలన్స్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఆగస్ట్ నుండి ఇలా ఉండదు... బ్యాలన్స్ చెక్ పై పరిమితి ఉండనుంది. ఆగస్టు 1 నుండి వినియోగదారులు ఏదైనా యూపిఐ యాప్‌ని ఉపయోగించి రోజుకు 50 సార్లు మాత్రమే తమ అకౌంట్లోని బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
అవసరం లేకున్నా బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకోవడాన్ని తగ్గించేందుకు ఈ పరిమితి విధించారు. దీంతో యూపిఐ యాప్స్ సర్వర్లపై భారం తగ్గుతుంది... తద్వారా వీటి పనితీరు మరింత వేగవంతం అవుతుంది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకే ఈ పరిమితి విధించినట్లు NPCI చెబుతోంది.
2. బ్యాంక్ అకౌంట్ లింక్ చెకింగ్ పై పరిమితి
మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయ్యిందో యూపిఐ యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీస్ ను ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు... కానీ ఆగస్ట్ 1 నుండి దీనిపై కూడా పరిమితి ఉంటుంది. వినియోగదారులు యూపిఐ యాప్ ద్వారా రోజుకు కేవలం 25 సార్లు మాత్రమే ఇలా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
3. ఆటో-డెబిట్స్ కు ప్రత్యేక సమయం
కరెంట్, వాటర్ వంటి ప్రతినెలా చెల్లించే బిల్లులు, వివిధ సబ్‌స్క్రిప్షన్‌లు, EMIల కోసం యూపిఐ యాప్స్ లో ఆటో-డెబిట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఎంచుకున్నరోజు ఆ బిల్లు ఆటోమేటిక్ గా చెల్లింపు జరిగిపోతుంది. దీనిపై కూడా కొన్ని పరిమితులు అమల్లోకి రానున్నాయి.
బిజీ సమయంలో యూపిఐ ద్వారా ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఉండకూడదని ఈ ఆటో-డెబిట్ సేవలపై పరిమితి విధించినట్లు ఎన్పిసిఐ చెబుతోంది. రోజూ ఉదయం 10AM లోపు, మధ్యాహ్నం 1PM నుండి 5PM మధ్య, రాత్రి 9.30PM తర్వాత మాత్రమే ఆటో డెబిట్ సేవలు కొనసాగుతాయని చెబుతోంది.
4. పెండింగ్ పేమెంట్స్ స్టేటస్ చెక్ పై పరిమితి
కొన్నిసార్లు యూపిఐ యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు పేమెంట్స్ ఆగిపోతాయి. అంటే మన అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి.. కానీ అవతలివారికి చెల్లింపు జరగదు. ఇలాంటి సమయంలో డబ్బుల గురించి తరచూ చెక్ చేసుకుంటారు. ఇలా పెండింగ్ పేమెంట్స్ గురించి ఇక కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు... ఒక్కో చెకింగ్ కి 90 సెక్లన్ల విరామం ఉండాలి.
యూపిఐ నిబంధనల్లో ఈ మార్పులు ఎందుకు?
ప్రస్తుతం భారతదేశంలో యూపిఐ పేమెంట్స్ వినియోగం తారాస్థాయికి చేరింది... నెలలో 16 బిలియన్స్ యూపిఐ లావాదేవీలు జరుగుతున్నాయి. యూపిఐ యాప్స్ వినియోగం పెరగడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడుతోంది... దీంతో ఒక్కోసారి సేవలు నిలిచిపోతున్నాయి. గత ఏప్రిల్, మేలో పలుమార్లు యూపిఐ సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇకపై అంతరాయం లేకుండా యూపిఐ సేవలను అందించేందుకు NPCI సర్వర్స్ పై భారం తగ్గించే నిర్ణయం తీసుకుంది. అందుకోసమే అనవసరంగా బ్యాలన్స్ చెక్ చేసుకోవడంతో పాటు అత్యవసరం కాని కొన్ని సేవలపై పరిమితి విధించింది. తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని చెబుతోంది.