Good News: భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం..లీటర్ పెట్రోల్ రూ. 80 మాత్రమే...ఎలాగంటే..?
ఎల్పిజి సిలిండర్ తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను కూడా భారీగా తగ్గించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో నిర్మల సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్రాలు ఒప్పుకున్నట్లయితే తాము జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే, పెట్రోల్ డీజిల్ ధరలపై కనీసం 30 రూపాయలు వరకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన చూసినట్లయితే, లీటర్ పెట్రోల్ ధర కేవలం 80 రూపాయలకే లభించే అవకాశం ఉంది. అదే సమయంలో డీజిల్ ధర 75 రూపాయలకే లీటర్లు లభించే అవకాశం ఉంది.
ఎల్పిజి సిలిండర్ ధరలను ఏకంగా రెండు వందల రూపాయలు తగ్గించడంతో, ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ ధరలను కూడా భారీగా తగ్గించే అవకాశం ఉందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సైతం పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు.
ఫిబ్రవరి 16న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ను తమ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ముందుగా రాష్ట్రాలు అంగీకరించాలని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇంతకు ముందు కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులు అనేక సార్లు సానుకూల ప్రకటనలు చేశారు.
నిజానికి పెట్రోలియం ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తే.. వాటిపై పన్నులు విధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా సంపాదిస్తున్నాయి. ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రభుత్వాల ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. అయితే, దీని వల్ల సామాన్యులకు చాలా తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ లభిస్తుంది.
ఇప్పుడు పెట్రోల్‌పై ఎంత పన్ను విధిస్తున్నారు. GST పరిధిలోకి వచ్చిన తర్వాత అది ఎంత అవుతుంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రస్తుతం ఢిల్లీలోని డీలర్లకు పెట్రోల్ రూ.57.36కు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.19.90 ఎక్సైజ్ సుంకం ఉంది. దీని తర్వాత, డీలర్ కమీషన్ సగటున రూ. 3.75 జోడిస్తారు. ఇప్పుడు రాష్ట్రాలు ఉత్పత్తి చేయబడిన విలువపై వేర్వేరు VAT (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. ఢిల్లీలో ఇది 19.40 శాతం. ఈ విధంగా వ్యాట్ 15.71 పైసలుగా మారింది. మొత్తం మీద ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72కి చేరింది.
జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోల్ ధర ఎంత?..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తెస్తే వ్యాట్, ఎక్సైజ్ సుంకం తొలగిపోతాయి. పెట్రోలుపై జీఎస్టీ అత్యధికంగా 28 శాతంగా ఉందనుకుందాం. ఇప్పుడు డీలర్ పెట్రోల్‌ను (రూ. 57.36) పొందే ధరపై 28 శాతం GST విధించబడుతుంది. పెట్రోల్ పై పన్ను రూ.16.06కు తగ్గనుంది. దీనికి డీలర్ కమీషన్ రూ.3.75 కలిపినా పెట్రోల్ ధర దాదాపు రూ.77 వరకు వస్తుంది. అయితే దీని వల్ల రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.