Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Gold SIP: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, ఒకేసారి కొనడం సామాన్యులకు కష్టమే. కానీ చిన్నగా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ బంగారంలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్రత్యామ్నాయం. కాబట్టి బంగారం కొనేటప్పుడు ఇలా ప్లాన్ చేస్కోండి. బంగారమే బంగారం
వంద రూపాయలతో బంగారం కొనొచ్చు!
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, ఒకేసారి వేల రూపాయలు పెట్టి కొనడం సామాన్యులకు కష్టమే. కానీ, చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ బంగారంలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా రోజుకు రూ.100 పక్కన పెడితే, నెలకు రూ.3,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ మొత్తాన్ని గోల్డ్ స్కీమ్స్ లేదా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడితే, కాలక్రమేణా కొంచెం కొంచెంగా బంగారం కూడబెట్టుకోవచ్చు.
ఒక గ్రాము బంగారం ధర ఎంత?
ఉదాహరణకు 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.15 వేలు అనుకుందాం. ఇది కేవలం లెక్కల కోసం తీసుకున్న కనీస ధర మాత్రమే. బంగారం ధరలు రోజూ మారుతుంటాయి కాబట్టి, వాస్తవానికి వచ్చే బంగారం పరిమాణంలో మార్పులు ఉండొచ్చు. అంతేకాకుండా, బంగారు ఆభరణాలు కొనేటప్పుడు తరుగు, జీఎస్టీ లాంటి అదనపు ఖర్చులు ఉంటాయి. కానీ డిజిటల్ గోల్డ్ లేదా ఇతర గోల్డ్ ఫండ్స్‌లో ఈ ఖర్చులు వేరుగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆయా పథకాల నియమ నిబంధనలు, ఛార్జీలను ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం.
రోజుకు రూ.100 దాచుకుంటే 1 గ్రాము ఎప్పుడొస్తుంది?
రోజుకు రూ.100 చొప్పున లెక్కేసుకుంటే, 30 రోజుల్లో రూ.3,000 ఆదా చేయవచ్చు. అలాగే 90 రోజుల్లో రూ.9,000, 180 రోజుల్లో రూ.18,000, 300 రోజుల్లో రూ.30,000 పెట్టుబడి పెట్టొచ్చు. ఒక గ్రాము బంగారం ధర రూ.15,306 అనుకుంటే, సుమారు 154 రోజుల్లో రూ.15,400 వరకు పొదుపు చేయవచ్చు. అంటే, బంగారం ధర స్థిరంగా ఉందనుకుంటే, సుమారు 5 నెలల్లో 1 గ్రాము బంగారం కొనేంత డబ్బును మనం కూడబెట్టవచ్చు.
చిన్న పొదుపు.. దీర్ఘకాలంలో పెద్ద ఆస్తి!
చిన్న చిన్న పొదుపులు దీర్ఘకాలంలో పెద్ద ఆస్తిగా మారుతాయి అనడానికి బంగారం పెట్టుబడే బెస్ట్ ఎగ్జాంపుల్. రోజువారీ ఖర్చుల్లో రూ.100 పక్కన పెట్టడం ద్వారా సామాన్య కుటుంబాలు కూడా సులువుగా బంగారం కొనుక్కోవచ్చు.
ఒక గ్రాము బంగారం ధర రూ.15,306 దగ్గరే స్థిరంగా ఉందనుకుంటే.. 1 నెలలో (రూ.3,000) 0.196 గ్రాములు, 3 నెలల్లో (రూ.9,000) 0.588 గ్రాములు, 5 నెలల్లో (రూ.15,000) 0.980 గ్రాములు వస్తుంది. కచ్చితంగా 154 రోజుల్లో రూ.15,400 పొదుపు చేసి 1 గ్రాము బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. అదే 6 నెలలు దాచుకుంటే 1.176 గ్రాములు, 9 నెలల్లో 1.764 గ్రాములు వస్తుంది. ఏడాది (365 రోజులు) పొదుపు చేస్తే రూ.36,500 పోగవుతుంది. దీని ద్వారా సుమారు 2.384 గ్రాముల బంగారం కొనొచ్చు.
కానీ మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం ధరలు రోజూ మారుతుంటాయి. ధర పెరిగినప్పుడు వచ్చే బంగారం తగ్గుతుంది, ధర తగ్గితే ఎక్కువ బంగారం వస్తుంది. ఆభరణాలుగా కొంటే తరుగు, తయారీ ఛార్జీలు, 3% జీఎస్టీ అదనంగా పడతాయి.
ఈ అదనపు ఖర్చులను తగ్గించుకోవడానికి డిజిటల్ గోల్డ్, గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ లేదా బంగారు నాణేలు కొనడం బెటర్. డిజిటల్ పద్ధతిలో ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొంచెం కొంచెంగా కొనుక్కోవచ్చు. ఇలాంటి క్రమబద్ధమైన పొదుపు భవిష్యత్తులో ఆర్థిక భద్రతను ఇస్తుంది.
ఏడాదికి రూ.36,500 పెట్టుబడి!
రోజుకు రూ.100 అనేది చిన్న మొత్తంగానే అనిపించొచ్చు. కానీ వరుసగా 365 రోజులు పెట్టుబడి పెడితే, మొత్తం రూ.36,500 పోగవుతుంది.
బంగారం ధర స్థిరంగా ఉంటే, ఈ మొత్తానికి సుమారు 2.38 గ్రాముల బంగారం వస్తుంది. ఒకవేళ ధర పెరిగితే, అదే రూ.36,500కి వచ్చే బంగారం పరిమాణం తగ్గుతుంది. అదే ధర తగ్గితే, ఈ పెట్టుబడితోనే ఎక్కువ బంగారం కొనుక్కోవచ్చు.
అందుకే రోజువారీ పెట్టుబడిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక నిర్దిష్ట రోజున బంగారం ధర ఎంత ఉందనే దానికంటే, మనం క్రమం తప్పకుండా ఎంత మొత్తం పెట్టుబడి పెడుతున్నాం అన్నదే ముఖ్యం.
రోజుకు రూ.100 పెట్టుబడి పెడితే లాభం గ్యారెంటీనా?
బ్యాంకు ఎఫ్‌డీల్లాగా బంగారంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ ఏమీ ఉండదు. ఉదాహరణకు, ఏడాదిలో బంగారం ధర పెరిగితే మీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. అదే ధర తగ్గితే మీ పెట్టుబడి విలువ కూడా తగ్గుతుంది.
అంతేకాకుండా, రోజుకు రూ.100 పెట్టుబడి పెడుతున్నప్పుడు.. ప్రతిరోజూ ఒకే ధరకు బంగారం రాదు. ధరలు మారుతూ ఉంటాయి కాబట్టి, కొన్ని రోజులు ఎక్కువ, కొన్ని రోజులు తక్కువ బంగారం వస్తుంది. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రధాన లక్షణం ఇదే.
డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తలు!
చిన్న మొత్తాలతో డిజిటల్ గోల్డ్ కొనడం సులువుగానే అనిపించినా.. పెట్టుబడి పెట్టే ముందు దాని భద్రత, నిల్వ చేసే విధానం, అమ్మకపు నిబంధనలు, ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ముఖ్యంగా డిజిటల్ గోల్డ్ అనేది షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒకే రకమైన నియంత్రణలో ఉండదు. కాబట్టి మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడుతున్నారు, ఆ సంస్థ బంగారాన్ని ఎలా నిల్వ చేస్తోంది, కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎలాంటి ఛార్జీలు పడతాయి అనేది గమనించడం చాలా ముఖ్యం.
దీనికి ప్రత్యామ్నాయంగా, పారదర్శకంగా ఉండే గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిని కూడా పెట్టుబడిదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవచ్చు.
రోజుకు రూ.100 పొదుపుతో లాభం ఏంటి?
నెలకు ఒకేసారి రూ.3,000 పక్కన పెట్టడం కొందరికి కష్టంగా ఉండొచ్చు. కానీ రోజుకు రూ.100 చొప్పున విడదీసి చూస్తే, మన రోజువారీ ఖర్చుల్లో చిన్న మార్పులు చేసుకుని ఆ మొత్తాన్ని సులువుగా పొదుపు చేయవచ్చు.
ఏడాదికి రూ.36,500 అవుతుంది. దీన్ని ఇలాగే కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే, బంగారం ధరల పెరుగుదలకు అనుగుణంగా మీ పెట్టుబడి విలువ కూడా పెరిగే అవకాశం ఉంది.
అయితే, భవిష్యత్తులో బంగారం ధర కచ్చితంగా పెరుగుతుందని లేదా ఇంత లాభం వస్తుందని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. కాబట్టి కేవలం బంగారంపైనే ఆధారపడకుండా.. మీ ఆదాయం, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్, ఇతర పెట్టుబడులతో పాటు దీన్ని కూడా మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగంగా చూసుకోవడం మంచిది.
రోజుకు రూ.100 అనేది పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు. కానీ క్రమం తప్పకుండా దాచుకుంటే నెలలో రూ.3,000, ఏడాదిలో రూ.36,500 అవుతుంది.
బంగారం ధర రూ.15,306గా లెక్కేసుకుంటే, సుమారు 154 రోజుల్లో 1 గ్రాము బంగారం కొనేంత డబ్బును మనం కూడబెట్టవచ్చు. అయితే, వాస్తవానికి బంగారం ధరలు రోజూ మారుతుంటాయి కాబట్టి 1 గ్రాము చేరడానికి పట్టే సమయం కూడా మారొచ్చు.
అందుకే, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ముందుగా అందులోని రిస్క్‌లు, ఛార్జీలు, పెట్టుబడి విధానాన్ని అర్థం చేసుకుని, తాము క్రమం తప్పకుండా ఎంత కట్టగలరో ఆ మొత్తాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

