షాకింగ్.. తులం బంగారం రూ.2 లక్షలు
Gold price: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఆర్థిక నిపుణులు క్రిస్ వుడ్ అంచనా ప్రకారం బంగారం ధరలు భారత్‌లో తులం రూ.2 లక్షలు దాటే అవకాశముంది.

బంగారం పరుగులు.. కారణమేంటో తెలుసా?
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా కొత్త రికార్డులు బద్దలుకొడుతున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం దాదాపు 43 శాతం పెరిగింది. భారత్ లో మక్కువ ఎక్కువ, డిమాండ్ పెరగడం, ఈ సురక్షిత పెట్టుబడిగా భావించడం బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కొత్త సుంకాలు, ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరగడం కూడా కారణాలుగా ఉన్నాయి. ఈ అంశాలన్నీ కలిసి గోల్డ్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి.
తులం బంగారం రూ. 2 లక్షలు.. సంచలనంగా క్రిస్ వుడ్ అంచనా
బంగారం ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్‌లో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ అంచనాలు వేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
క్రిస్ వుడ్ తాజా అంచనా ప్రకారం, బంగారం ధర ఔన్సుకు 6,600 డాలర్ల వరకు చేరవచ్చని చెప్పారు. ప్రస్తుత ధర 3,745 డాలర్ల వద్ద ఉండగా, ఇది దాదాపు 76% పెరుగుతుందని అంచనా వేశారు. భారత్ లో తులం బంగారం రూ. 2 లక్షలకు చేరుతుందని అన్నారు. గతంలో ఆయన చేసిన అంచనాలు ఎక్కువగా నిజమయ్యాయి కాబట్టి ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో క్రిస్ వుడ్ ఏం చెప్పారంటే?
తన Greed and Fear నివేదికలో క్రిస్ వుడ్ 1980లో బంగారం అమెరికా ప్రజల తలసరి ఆదాయంలో 9.9% వాటాను సూచించిందని, ప్రస్తుతం అది 5.6% మాత్రమేనని గుర్తు చేశారు. ఆ నిష్పత్తి మళ్లీ 9.9%కి చేరుకుంటే బంగారం ధర 6,571 డాలర్లకు చేరుతుందని అన్నారు. అందువల్ల 6,600 డాలర్ల లక్ష్యం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
భారతీయ మార్కెట్ లో గోల్డ్ పరుగులు
అమెరికాలో ఔన్స్ ధర 6,600 డాలర్లకు చేరితే, దాని ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్‌పైనా కూడా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర ₹1,13,000 నుంచి ₹1,17,000 మధ్య ఉంది. నిపుణుల అంచనా ప్రకారం, గోల్డ్ ఇదే తరహాలో పరుగులు పెడితే భారత మార్కెట్‌లో 10 గ్రాములు రూ.2 లక్షలు దాటే అవకాశం ఉంది. దీంతో ఆభరణాల కొనుగోలు సాధారణ కుటుంబాలకు మరింత భారంగా మారుతుంది.
బంగారం పై పెట్టుబడులు
క్రిస్ వుడ్ తన విశ్లేషణలో బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించాలని సలహా ఇచ్చారు. 2002 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో కనీసం 40% బంగారంనే ఉంచారు. 2020లో బిట్‌కాయిన్ చేర్చినప్పటికీ, గోల్డ్ వాటా తగ్గలేదు. ఆయన అంచనాల ప్రకారం, భవిష్యత్తులో వెండి కూడా మంచి రాబడులు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. అయితే, బంగారం ధరలు నిజంగానే ఈ స్థాయికి చేరుకుంటాయా లేదా అనేది రాబోయే రోజులే చెబుతాయి. పెట్టుబడుల విషయంలో మరింత మంది నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.