అందమైన స్కూటర్లు అందుబాటు ధరలోనే.. గోదావరి మోటార్స్ 3 కొత్త ఈవీలు విడుదల
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కొత్త కొత్త వెహికల్స్ సందడి చేస్తున్నాయి. మన దేశంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్స్ తో ఉన్న ఈ వెహికల్స్ డీటైల్స్ చూద్దాం రండి.

భారత్ మొబిలిటీ గ్లోబల్ షో 2025లో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ మూడు కొత్త ఈవీలను ప్రారంభించింది. వీటిలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫియో డిఎక్స్ ఈ మరియు ఫియో జెడ్, మరియు ఒక ప్యాసింజర్ ఆటో ఉన్నాయి. ఫియో డిఎక్స్ ఈ, ఫియో జెడ్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. స్వదేశీ కంపెనీ కాబట్టి ఇక్కడ ప్రజల అవసరాలు బాగా తెలుస్తాయి. అందుకే ఇవి వివిధ వర్గాల ప్రజల అవసరాలను తీర్చే విధంగా కంపెనీ తయారు చేసింది.
కంపెనీ రోజీ ఎకో త్రీ-వీలర్‌ను కూడా విడుదల చేసింది. రోజీ ఎకో షోరూమ్ ధర రూ.2,95,999.
ఫియో జెడ్ తక్కువ వేగంతో ప్రయాణించే స్కూటర్. ఇది చిన్న నగర ప్రయాణాలకు అనువైనది. ఫియో డిఎక్స్ గంటకు 80 కి.మీ వేగం ప్రయాణించగలదు. ఒకే ఛార్జ్‌తో 150 కి.మీల వరకు వెళుతుంది.
వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, కంపెనీ కేర్ యాప్‌ను విడుదల చేసింది. ఇది ఈవీలను సులభంగా నియంత్రించడంలో సహాయపడే స్మార్ట్ సాధనం. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్, అధునాతన బ్యాటరీ, ఉన్నతమైన బిల్డ్ క్వాలిటీతో ఈ వాహనాలు కంపెనీ తయారు చేసింది.
ఫియో డిఎక్స్ శక్తివంతమైన 5.0 kW మోటార్ ను, 140 Nm పీక్ టార్క్ ను కలిగి ఉంది. ఇది హై-ఎండ్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గంటకు 80 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. మూడు డ్రైవింగ్ మోడ్‌లతో 150 కి.మీల పరిధి వరకు పరుగులు తీయగలరు. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు 7 అంగుళాల TFT స్క్రీన్, బెస్ట్ బూట్ స్పేస్ తో పాటు 4.2 kWh బ్యాటరీ ఇందులో ఉన్నాయి. ఇది 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఫియో జెడ్ డిటాచబుల్ LMFP సిలిండర్ బ్యాటరీ (48V/30Ah) ఒకే ఛార్జ్‌తో 80 కి.మీల పరిధిని అందిస్తుంది. దీనికి 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. లేదా 30,000 కి.మీ తిరిగే వరకు వారంటీ లభిస్తుంది. ఇదే కాకుండా 5 సంవత్సరాల/50,000 కి.మీ బ్యాటరీ వారంటీ ఫెసిలిటీ కూడా ఉంది.
రోజీ ఎకో స్కూటర్ లో 150 Ah లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. ఇది ఒకే ఛార్జ్‌తో 120 కి.మీల వరకు వెళ్లగలదు. ఈ స్కూటర్ స్టీల్ ఫ్రేమ్ తో తయారైంది. అన్ని చక్రాలకు హైడ్రాలిక్ బ్రేక్‌లు ఉన్నాయి. నలుగురు కూర్చొనే విధంగా సీటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీని 7.8 kWh బ్యాటరీ కేవలం 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.