లోన్ తీసుకున్న వారికి పండగలాంటి వార్త.. డిసెంబర్ నుంచి తగ్గనున్న EMI.?
EMI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనుందా.? రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట లభించనుందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..

డిసెంబర్‌లో రెపోరేటు తగ్గే అవకాశం
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజా ఇంటర్వ్యూలో డిసెంబర్ నెల మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం తగ్గడం, ఆర్థిక వృద్ధి మెరుగవడం ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
MPC గత సమావేశంలోనే సూచనలు
మల్హోత్రా మాట్లాడుతూ గత అక్టోబర్‌లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలోనే రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో MPC మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే ఆగస్ట్ తర్వాత రేట్లు మార్చలేదు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కేంద్ర బ్యాంకు ఆశావాదం దేశ ద్రవ్యోల్బణం ప్రస్తుతం చరిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి చేరింది. ముఖ్యంగా సరుకు ధరలు తగ్గడం, GST పన్నుల్లో తగ్గింపు కారణంగా అక్టోబర్‌లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 0.25% వద్దకు పడిపోయింది. ఈ పరిణామం వడ్డీ రేట్లు తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో RBI తన FY26 CPI అంచనాను 2.6%కి తగ్గించగా, GDP వృద్ధి అంచనాను 6.8%కి పెంచింది.
మార్కెట్ రియాక్షన్ ఏంటంటే.?
గవర్నర్ వ్యాఖ్యల తర్వాత 10 సంవత్సరాల బాండ్ యీల్డ్ స్వల్పంగా పడిపోయింది. మోర్గాన్ స్టాన్లీ వంటి ఫైనాన్షియల్ సంస్థలు డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నాయి. అయితే మార్కెట్లోని ఓవర్‌నైట్ ఇండెక్స్‌డ్ స్వాప్ రేట్స్ (OIS) చూస్తే నిర్ణయం మారకుండా ఉండే అవకాశమూ కనిపిస్తోంది. అంటే మార్కెట్ ఇంకా స్పష్టమైన దిశ కోసం ఎదురు చూస్తోంది.
రూపాయి స్థితి: సహజమైన తగ్గుదల
సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ రూపాయి విలువ తగ్గడం సహజమని, ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నప్పుడు సంవత్సరానికి 3–3.5% రూపాయి పడిపోవడం సాధారణమని చెప్పారు. ఈ సంవత్సరం రూపాయి ఇప్పటివరకు 4%కు పైగా పడిపోయి, ఆసియా కరెన్సీల్లో అత్యంత బలహీనమైన కరెన్సీల్లో ఒకటిగా మారింది. అయితే RBI అవసరం ఉన్నప్పుడే రూపాయిని స్టెబిలైజ్ చేయడానికి మార్కెట్లో జోక్యం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

