ఖాతాదారులకు అలర్ట్.. ఈ బ్యాంక్ సేవలు 4 రోజుల పాటు బంద్, యూపీఐ కూడా..
బ్యాంకు ఖాతాదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. నాలుగు రోజుల పాటు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. ఇందుకు సంబంధించి ఖాతాదారుల మొబైల్ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపించారు. ఇంతకీ ఏంటా బ్యాంకు నాలుగు రోజుల పాటు సేవలు అందుబాటులో ఉండకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు గ్రామీణ బ్యాంకుల విలీనానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఒక రాష్ట్రం.. ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు అనే ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 43 గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విలీనంతో బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందని కేంద్రం భావించింది. ఏపీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉన్నాయి. వీటిల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మిగితా 3 బ్యాంకులు విలీనమవుతాయి. అంటే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కనిపించవు.
అదే విధంగా తెలంగాణ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలందిస్తున్నాయి. ఇకపై ఇక్కడ ఒక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇక్కడి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విభాగం అందులో విలీనం కానుంది. ఇకపై తెలంగాణలో కేవలం తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మాత్రమే ఉండనుందన్నమాట. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 493 ఏపీజీవీబీ బ్రాంచులను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జవనరి 1 2025 నుంచి విలీనం చేస్తున్నట్లు ఖాతాదారులకు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు.
యూపీఐ, ఏటీఎమ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు ఆధార్ ఆధారిత పేమెంట్ సేవలు కూడా అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఖాతాదారులు తమ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అయితే వీటిలో ఒకటి నాల్గవ శనివారం, ఆదివారం ఎలాగో సెలవు ఉండగా.. అదనంగా సోమ, మంగళవారం బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.