మీ ఊరిలోనే నెలకు రూ. 2 లక్షలు సంపాదించాలా.? ఈ బిజినెస్‌తో మీ తలరాత మారడం ఖాయం
Business Idea: ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ పెరిగిపోతోంది. మెట్రో నగరాల్లో నాన్‌వెజ్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఈ వ్యాపారాన్ని టైర్2 నగరాల్లో ప్రారంభిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలంటే.?

మార్కెట్ డిమాండ్
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో నాన్ వెజ్ ఆన్‌లైన్ డెలివరీ సర్వీసులు పెద్ద స్థాయిలో పనిచేస్తున్నాయి. బ్లింకిట్, టెండర్ కట్, ఫ్రెష్ టూ హోమ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఈ సేవలను అందిస్తున్నాయి. అయితే టైర్ పట్టణాలు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఇలాంటి సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేవు. స్థానిక మాంసం షాపులు ఉన్నా, హైజీనిక్ ప్యాకేజింగ్, హోం డెలివరీ లాంటి సేవలు అందించడం లేదు. కాబట్టి మీరు ఈ మార్కెట్లోకి ముందుగా అడుగు పెడితే, మీ బ్రాండ్‌కు బలమైన స్థానం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలంటే.?
ఈ వ్యాపారానికి కొన్ని ప్రాథమిక వస్తువులు అవసరపడుతాయి.
* డీప్ ఫ్రీజర్‌లు: మాంసం తాజాగా నిల్వ ఉంచేందుకు.
* డిజిటల్ వెయింగ్ మెషిన్: ఖచ్చితమైన కొలతల కోసం.
* ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మెటీరియల్: వాక్యూమ్ ప్యాక్, సీలింగ్ బ్యాగ్స్, స్టిక్కర్స్ మొదలైనవి.
* డెలివరీ వాహనాలు: రెండు చక్రాల బైకులు లేదా చిన్న ఫ్రీజర్ వాన్.
* చిన్న వర్క్‌షాప్ స్పేస్: కటింగ్, ప్యాకింగ్, క్లీనింగ్ కోసం.
* లైసెన్స్‌లు: FSSAI ఫుడ్ లైసెన్స్, స్థానిక మునిసిపల్ అనుమతి, GST రిజిస్ట్రేషన్.
ఎంత పెట్టుబడి అవసరం?
ఆన్‌లైన్ నాన్ వెజ్ బిజినెస్ చిన్న స్థాయిలో మొదలుపెట్టాలంటే ప్రారంభంలో రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు సరిపోతుంది. ఇందులో..
* ఫ్రీజర్‌లు – రూ. 1.5 లక్షలు
* ప్యాకేజింగ్ సామగ్రి – రూ. 50,000
* వెబ్‌సైట్ లేదా యాప్ – రూ. 1.5 లక్షలు
* డెలివరీ బైకులు – రూ. 1 లక్ష (డెలివరీ బాయ్స్‌కి కమిషన్ ఇస్తే వారే సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటారు)
* లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులు – రూ. 1 లక్ష
* మొదట 2–3 రకాల నాన్ వెజ్ కేటగిరీలతో (చికెన్, మటన్, ఫిష్) మొదలు పెట్టి, డిమాండ్ పెరిగిన కొద్దీ విస్తరించవచ్చు.
వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
* మార్కెట్ రీసెర్చ్ చేయండి: మీ పట్టణంలో ఏ రకమైన మాంసం ఎక్కువగా అమ్ముడవుతుంది తెలుసుకోండి.
* సప్లయర్లను ఎంపిక చేయండి: నాణ్యమైన చికెన్, మటన్ సరఫరా చేసే రైతులు లేదా హోల్‌సేల్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకోండి.
* బ్రాండ్ పేరు, లోగో రూపొందించండి: మీకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ పేరును రూపొందించుకోండి. ఈ పేరు మీ ప్రాంత స్థానికతతో కలిపిన పేరు అయితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఉదాహరణకు సిద్ధిపేట ఫ్రెష్ మీట్.
* యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ వ్యవస్థ: కస్టమర్లు సులభంగా ఆర్డర్ పెట్టేలా చేయాలి. లేదా మొదట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఆర్డర్లు స్వీకరించవచ్చు.
* హైజీన్, టైమ్ డెలివరీ, కస్టమర్ రివ్యూస్ – ఇవే మీ బ్రాండ్ వృద్ధికి ప్రధాన బలం.
లాభాలు ఎలా ఉంటాయంటే.?
మీరు అందించే సేవలు, నాణ్యత, మీరు చేసే ప్రచారంపై మీ లాభాలు ఆధారపడి ఉంటాయి. సరైన ప్లానింగ్‌తో నెలకు కనీసం 20–25% నికర లాభం పొందొచ్చు. ఉదాహరణకు రోజుకు 100 ఆర్డర్లను డెలివరీ చేస్తే, నెలకు రూ. 1.5–2 లక్షల వరకు నికర లాభం పొందవచ్చు. ఆదివారాల్లో ఆర్డర్లు మరింత ఎక్కువగా ఉంటాయి. పరిశుభ్రత, నాణ్యత, సమయపాలన అనే మూడు అంశాలపై దృష్టి పెడితే, మీ బ్రాండ్ పెద్ద సంస్థలతో పోటీ పడగలదు. భవిష్యత్తులో మీ సొంత ఫ్రాంచైజీ మోడల్‌ను కూడా అభివృద్ధి చేయవచ్చు.