UPI: యూపీఐ కొత్త రూల్స్.. ఆ విషయంలో లిమిట్ దాటితే అంతే..
New UPI Rules : యూపీఐ (UPI) కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. లావాదేవీలు మరింత సురక్షితంగా, సులభంగా సాగేందుకు ఈ మార్పులు కీలకం కానున్నాయి. అయితే.. ఆ మార్పుల వల్ల యూజర్ల కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇంతకీ ఆ మార్పులేంటీ?

అరచేతిలో బ్యాంక్
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో UPI భాగంగా మారింది. కూరగాయలు కొనడం నుంచి పెద్ద మొత్తాల లావాదేవీల వరకు అన్నింటికీ UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అది కూడా అన్నీ ఒక్క క్లిక్‌లో పూర్తి చేయవచ్చు.
యూపీఐ కొత్త మార్గదర్శకాలు వచ్చేశాయ్
తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఈ మార్పులు కేవలం లావాదేవీలను సులభతరం చేయడమే కాదు, Google Pay, PhonePe వంటి ప్రముఖ యాప్‌లపై సర్వర్ భారాన్ని తగ్గిస్తాయి. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ మార్పులు తీసుకవచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బ్యాలెన్స్ చెక్‌కి లిమిట్!
ప్రస్తుతం UPI యాప్‌ల ద్వారా ఎన్ని సార్లైనా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. కానీ ఆగస్టు 1, 2025 నుంచి ప్రతి యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే చెక్ చేయడానికి అనుమతించబడుతుంది. ఇది అనవసరమైన అభ్యర్థనలు తగ్గించి, యాప్‌లపై సర్వర్ ఒత్తిడిని తగ్గించడానికే తీసుకున్న నిర్ణయం.
బ్యాంక్ అకౌంట్ లిస్ట్ చూసే పరిమితి
మీ మొబైల్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను UPI యాప్‌లో చూసే అవకాశం ఇక పరిమితమే. ఆగస్టు 1, 2025 నుంచి, ప్రతి యాప్‌లో రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే లింక్‌డ్ అకౌంట్‌లను చెక్ చేయవచ్చు. ఈ మార్పు అనవసర API కాల్స్‌ను తగ్గించి, యాప్‌ల పనితీరును వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు తీసుకొచ్చారు.
ఆటోపేమెంట్ కు టైమింగ్ లిమిట్స్
కరెంట్ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్స్, EMI లాంటి పేమెంట్లకు ప్రస్తుతం UPI యాప్‌లలో ఆటో డెబిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇకపై ఈ ఆటోమేటెడ్ చెల్లింపులకు టైమ్ లిమిట్స్ నిర్ణయించారు. ఆగస్టు 1, 2025 నుంచి ఆటో డెబిట్‌ల ప్రాసెసింగ్ ఉదయం 10 గంటల వరకు, మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు, ఆ తరువాత రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఆటో డెబిట్‌లు జరుగుతాయి. ఇది పీక్ టైమ్స్‌లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు, సిస్టమ్ పనితీరును మెరుగుపరచేందుకు తీసుకున్న కీలక చర్య.
పెండింగ్ పేమెంట్ పై పరిమితి!
కొన్నిసార్లు UPI ద్వారా పేమెంట్ చేసినప్పుడు డబ్బులు కట్ అయి, అవతలి వ్యక్తికి అందకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో యూజర్లు "Pending Transaction Status" చెక్ చేస్తుంటారు. ఇకపై వాటిని చెక్ చేయడానికి కూడా కొత్త లిమిట్ వస్తోంది. ఆగస్టు 1, 2025 నుంచి.. మీరు పెండింగ్ పేమెంట్ స్టేటస్‌ను రోజుకు గరిష్టంగా 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. అలాగే.. ప్రతి చెక్ మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి.
ఎందుకు ఈ మార్పులు?
భారతదేశంలో UPI లావాదేవీలు నెలకు 16 బిలియన్లకు చేరుకుని, అపారమైన వృద్ధిని సాధించాయి. ఈ భారీ వినియోగం సర్వర్లపై చాలా భారాన్ని కలిగిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో చాలా UPI యాప్‌లు పనిచేయడం ఆగిపోయాయి. సర్వర్ భారాన్ని తగ్గించడం ద్వారా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడమే NPCI లక్ష్యం.