Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? మినిమం బ్యాలెన్స్ లేకపోతే అంతే సంగతులు
కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్సీపై కఠిన నిబంధనలు అమలు చేస్తుంటాయి. ఖాతాల్లో నిర్ణీత మొత్తం లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

కీలక మార్పులు
డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) ఇండియా ఖాతాదారుల విషయంలో ఆగస్టు 1, 2025 నుంచి కీలక మార్పులు చేయనుంది. ముఖ్యంగా సేవింగ్స్ ఖాతాదారులపై నెలవారీ సగటు నిల్వ (AMB) నిర్వహణ విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. నెల చివర్లో ఖాతాలో కావాల్సిన కనీస నిల్వ లేకపోతే, అందులో లోటు మొత్తం మీద 6 శాతం జరిమానా విధించనున్నది. అయితే ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ. 500 వరకు మాత్రమే ఉంటాయి.
వివిధ ఖాతాలపై వర్తించే కొత్త ఛార్జీలు
DBS బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన సమాచార ప్రకారం, బ్యాంక్ వద్ద ఉన్న వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలపై కనీస నిల్వ నిబంధనలు ఇలా ఉంటాయి:
గ్రోత్ వన్ ఖాతా: నెలవారీ నిల్వ రూ. 5,000 అవసరం, లోటు ఉంటే గరిష్ఠంగా రూ. 250 జరిమానా.
DBS సాధారణ సేవింగ్స్ ఖాతా: మినిమమం బ్యాలెన్స్ రూ. 10,000, లోటుపై 6% చార్జీలు గరిష్ఠంగా రూ. 500.
గ్రోత్ సేవింగ్స్ ఖాతా: కనీస నిల్వ రూ. 10,000, అదే విధంగా గరిష్ఠ ఛార్జీ రూ. 500.
లక్ష్మి సేవింగ్స్ యూత్ పవర్ ఖాతా: కనీసం రూ. 100 ఉండాలి, జరిమానా గరిష్ఠంగా రూ. 5.
TASC యూత్ పవర్ ఖాతా: కనీస నిల్వ రూ. 10,000, 6% జరిమానా గరిష్ఠంగా రూ. 500 వరకు.
ఖాతాదారులకు బ్యాలెన్స్ నిర్వహణపై హెచ్చరిక
DBS బ్యాంక్ తెలిపిన ప్రకారం, ఒక్క రూపాయి నిల్వ తగ్గినా 6% చార్జీ వర్తిస్తుంది. ఉదాహరణకు, అవసరమైన రూ. 10,000లో రూ. 1,000 మాత్రమే నిల్వ ఉంటే, మిగిలిన రూ. 9,000పై 6% అంటే రూ. 540 జరిమానా అవుతుంది.
కానీ గరిష్ఠంగా రూ. 500 మాత్రమే వసూలు చేస్తారు. కాబట్టి రూ. 500 ఫైన్ పడుతుంది. కస్టమర్లకు పంపిన SMS లో ఇదే విషయాన్ని స్పష్టంగా వివరించింది. దీంతో ఖాతాదారులు తమ ఖాతాల్లో తగిన బ్యాలెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ATM విత్‌డ్రావల్ ఛార్జీలు కూడా పెంపు
మే 1, 2025 నుంచి DBS బ్యాంక్ ఇండియా ATMల ద్వారా నగదు ఉపసంహరణలపై కూడా నిబంధనలు మారాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఉచిత లావాదేవీల పరిమితి దాటి చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పై గరిష్ఠంగా రూ. 23 వసూలు చేయనుంది. అంతేకాదు, వర్తించే పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకుల ATMలపైనా ఇదే విధంగా ఛార్జీలు వర్తిస్తాయి.
వినియోగదారులపై ఆర్థిక భారం పెరిగే సూచనలు
ఈ కొత్త మార్పులతో DBS ఖాతాదారులపై ఖర్చు భారం పెరగడం ఖాయం. ముఖ్యంగా చిన్న నిల్వలు కలిగిన ఖాతాదారులకు ఇది ఎదురులేని ఆర్థిక ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. కనీస బ్యాలెన్స్ నిబంధనలు సక్రమంగా పాటించకపోతే జరిమానాలు తప్పవు.
అందుకే ఖాతాదారులు ముందస్తుగా ఈ మార్పులను గమనించి తగిన చర్యలు తీసుకోవాలి. సేవల నాణ్యతతో పాటు ఖాతాదారుల భద్రతను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి.