ATM: ఏటీఎమ్‌లో కార్డు పెడితే జేబుకు చిల్లు పడాల్సిందే.. భారీగా ఛార్జీలు పెంచిన బ్యాంక్
ATM: డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ఏటీఎమ్‌లలో డబ్బులు విత్‌డ్రా చేస్తూనే ఉన్నారు. అయితే ఏటీఎమ్‌లు ఉచితంగా సేవలు అందించవనే విషయం తెలిసిందే. కాగా తాజాగా ఎస్‌బీఐ ఈ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బీఐ కస్టమర్లకు కీలక సమాచారం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. ఫ్రీ ట్రాన్సాక్షన్ పరిమితి పూర్తయిన తర్వాత ఇకపై ఏటీఎం వినియోగం ఖరీదవుతుంది. ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలు వాడే SBI ఖాతాదారులపై ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి.
క్యాష్ విత్‌డ్రావల్ ఛార్జీలు ఎంతంటే
నెలవారీ ఫ్రీ లిమిట్ పూర్తయిన తర్వాత ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి డబ్బు తీసుకుంటే ఒక్కసారి క్యాష్ విత్‌డ్రావల్‌కు రూ.23 (GSTతో కలిపి) వసూలు చేస్తారు. ఇంతకుముందు ఇది రూ.21 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఛార్జీలు పెరిగాయి.
బ్యాలెన్స్ చెక్ చేస్తే కూడా ఫీజు
డబ్బు తీసుకోకపోయినా ఇకపై ఖర్చు తప్పదు. బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు ఒక్కసారి రూ.11 (GSTతో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉచితంగా ఉంటాయి.
ఈ ఛార్జీలు ఎవరికీ వర్తించవు
ఈ కొత్త ఛార్జీలు కొన్ని ఖాతాలపై అమలు కావు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలు, ఎస్‌బీఐ ఏటీఎం వాడే SBI డెబిట్ కార్డ్ హోల్డర్లు, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు ఉపయోగించే ఖాతాదారులకు అదనపు భారం ఉండదు.
ఛార్జీలు పెంచడానికి కారణం ఏంటి
ఇటీవల ఇంటర్‌చేంజ్ ఫీజు పెరగడంతో SBI ఈ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు యథాతథంగా కొనసాగుతాయి. ఆ లిమిట్ దాటిన తర్వాత మాత్రమే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. తరచుగా ఏటీఎం వాడే వారు ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

