OPG Mobility: కేవలం రూ.50 వేల నుంచే అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు
OPG Mobility: సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లంటే ధర చాలా ఎక్కువగానే ఉంటాయి. కొన్నింటి ధర చూస్తే సెకండ్స్ లో కారే కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది. కాని ఇటీవలే పేరు మార్చుకున్న ఓ ఫేమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ కేవలం రూ.50 వేలకే సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తోంది. ఆ కంపెనీ పేరు, స్కూటర్ల ఫీచర్లు తెలుసుకుందాం రండి.

గతంలో Okaya EVగా ఉన్న OPG మొబిలిటీగా ఇటీవల పేరు మార్చుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫెర్రాటో సిరీస్ స్కూటర్ల ధరలు తగ్గాయి. ఎందుకంటే కంపెనీ పేరు మార్చుకోవడం వల్ల మళ్లీ మార్కెట్ లోకి కొత్త పేరు ఎక్కాలంటే ఇలాంటి ఆఫర్లు ఇస్తేనే వీలవుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తక్కువ ధరకే అందించాలని OPG మొబిలిటీ నిర్ణయించింది.

ధరలు తగ్గిన స్కూటర్లు ఇవే..
OPG మొబిలిటీ నుంచి వచ్చిన ఫెర్రాటో ఫాస్ట్ F4, ఫెర్రాటో ఫాస్ట్ F2F, ఫెర్రాటో ఫ్రీడమ్ LI మోడల్స్‌పై ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. వీటి ధరలు ఇప్పుడు రూ. 49,999 నుంచి రూ. 1,54,999 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. అయితే ఇదే కంపెనీకి చెందిన మోటో ఫాస్ట్, ఫాస్ట్ F3 మోడల్స్ ధరలు తగ్గించలేదు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల తగ్గింపుపై OPG మొబిలిటీ ఛైర్మన్ అనిల్ గుప్తా మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పుడు ధరలు ప్రకటించిన స్కూటర్లన్నీ స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేశామని చెప్పారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని OPG మొబిలిటీ సీఈవో ఆన్షుల్ గుప్తా అన్నారు. OPG మొబిలిటీ బ్యాటరీ టెక్నాలజీలో ముందుందని తెలిపారు.
రూ. 49,999 నుంచే ధరలు
OPG మొబిలిటీ ఫెర్రాటో ఫాస్ట్ F4, ఫెర్రాటో ఫాస్ట్ F2F, 5 ఫెర్రాటో ఫ్రీడమ్ LI, ఫెర్రాటో పేరు మీద ఉన్న ఇతర ఉత్పత్తుల ధరలను కూడా తగ్గించింది. ఫెర్రాటో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇప్పుడు రూ. 49,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ. 1,54,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.
ఫెర్రాటో ఫాస్ట్ F4
ఫాస్ట్ F4 ఎత్తు 1040 మి.మీ., బరువు 99 కిలోలు. ఇది 5-6 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. బ్యాటరీ 72 V/60Ah సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 160 కి.మీ. వెళ్లగలదు.
OPG ఫెర్రాటో ఫ్రీడమ్ LI
OPG ఫెర్రాటో ఫ్రీడమ్ LI మోడల్ 8 V/30 Ah సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 70-75 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ఫెర్రాటో ఫ్రీడమ్ LI 4-5 గంటల్లో 80 శాతం బ్యాటరీని రీఛార్జ్ చేయగలదు. దీని ధర రూ.69,999 వేల నుంచి ప్రారంభమవుతుంది.
ఫెర్రాటో ఫాస్ట్ F2F
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 60 V / 36 Ah బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 70-80 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది.