ముగ్గురు హాయిగా ప్రయాణించడానికి బుల్లి ఎలక్ట్రిక్ కారు ఇదిగో
ఎలక్ట్రిక్ కార్లు ఇష్టపడే వారికి సింపుల్ గా ఉండే ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు తప్పకుండా నచ్చుతుంది. లోకల్ గా మీ పనులు చేసుకోవడానికి ముగ్గురు కూర్చోవడానికి కరెక్ట్ గా సరిపోయే ఈ కారు మీకు ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం బుకింగ్స్ జరుగుతున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మార్కెట్ కి వెళ్లడం, లోకల్ గా ఉండే ఫ్రెండ్స్ ని కలవడం ఇలాంటి చిన్న చిన్న పనులకు సాధారణంగా మనం బైక్ వాడతాం కదా.. ముగ్గురున్నా కూడా బైక్ పైనే అడ్జస్ట్ అయిపోయి వెళతాం. కాని ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే తీవ్రమైన దెబ్బలు తగడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం రావచ్చు. అందువల్ల ఎక్కడికి వెళ్లాలన్నా ముగ్గురు హాయిగా ప్రయాణించడానికి ఈ సింపుల్ కారు మీకు ఉపయోగపడవచ్చు. ఈ కారును యాకుజా కరిష్మా అనే కంపెనీ తయారు చేసింది. ఇది ఒక ఎలక్ట్రిక్ కార్.
ప్రస్తుతం భారతదేశంలో అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అనేక కొత్త ఎలక్ట్రిక్ బ్రాండ్లు తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇండియాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యాకూజా కూడా తన మూడు సీట్ల ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. దీన్ని ముందుగా బుక్ చేసుకోవడానికి కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ని ఉపయోగించాలని ప్రచారం చేస్తోంది. ఈ బుల్లి కారు ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.1,75,000 (ఎక్స్-షోరూం). ఆన్ రోడ్ ధర రూ.2,10,000 వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ వెబ్ సైట్ లో ఉంది. ఇందులో 60V 45Ah లిథియమ్-ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుంచి 7 గంటలు పడుతుంది.
ఈ కారులో ముగ్గురు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, ప్రయాణాలకు అనువుగా డిజైన్ చేశారు. ఈ కారులో డిజిటల్ డిస్‌ప్లే, పవర్ స్టీరింగ్, రియర్ పార్కింగ్ కెమెరా సన్‌రూఫ్, ఎల్‌ఈడీ లైట్లు, అల్లాయ్ వీల్స్, డ్రైవింగ్ మోడ్‌లు, కీలెస్ ఎంట్రీ, పవర్ విండో, పార్కింగ్ సెన్సార్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు, మూడు సీట్లు, పవర్ బ్రేక్‌లు, మొబైల్ ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారును ఎక్కడైనా సులభంగా పార్కింగ్ చేయవచ్చు. అయితే ఎయిర్‌బ్యాగ్స్, ABS వంటి ఫీచర్లు లేకపోవడం వల్ల దూర ప్రయాణాలకు ఇది ఉపయోగించడం అంత సేఫ్ కాదు. ఈ కార్ తక్కువ ఖర్చుతో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం చూస్తున్న వారికీ చక్కటి ఎంపిక అవుతుంది.