- Home
- Automobile
- Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు రూ.15 తగ్గుతుందా? కారణమేంటో తెలుసా?
Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు రూ.15 తగ్గుతుందా? కారణమేంటో తెలుసా?
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.15 వరకు తగ్గే అవకాశాలున్నాయి. మరి క్రూడాయిల్ ధరలు ఎందుకు తగ్గే అవకాశాలున్నాయో తెలుసా?

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
లీటర్ పెట్రోల్ ధర రూ.15 తగ్గితే సామాన్యులకు ఎంత ఊరట లభిస్తుందో కదా! ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారికి ఇంధన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం 'హార్ముజ్ జలసంధి' గురించి ఇరాన్ నుంచి వచ్చిన ఓ వార్త కొత్త ఆశలు రేపుతోంది. అమెరికా కొన్ని షరతులు ఒప్పుకుంటే, ఏడు రోజుల్లో ఈ మార్గాన్ని తెరుస్తామని ఇరాన్ సీనియర్ అధికారి తెలిపారు. మరి నిజంగానే హార్ముజ్ మార్గం తెరుచుకుంటుందా? క్రూడాయిల్ ధరలు తగ్గుతాయా? మన దగ్గర ఇంధన ధరలు లీటర్‌కు రూ.15 తగ్గుతుందన్న వార్తల్లో నిజమెంత? దీని వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం.
హార్ముజ్ మార్గం తెరవడానికి ఇరాన్ షరతులు...
అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా తన సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్ పోర్టులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తే వారం రోజుల్లో ఈ మార్గాన్ని తెరుస్తామని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. సైనిక ఘర్షణల కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మధ్యవర్తుల ద్వారా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనే ఇరాన్ ప్రతినిధులకు ఈ దౌత్యపరమైన చర్చలు జరిపే అధికారం ఉందని సమాచారం. అమెరికా సైనిక చర్యలు తగ్గించడం, పోర్టుల దిగ్బంధనాన్ని ఎత్తివేయడం ఇరాన్ ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
ప్రపంచ దేశాలకు హార్ముజ్ జలసంధి ఎందుకు కీలకం?
మిడిల్ ఈస్ట్‌లోని పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లను కలిపే కీలకమైన సముద్ర మార్గమే ఈ హార్ముజ్ జలసంధి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ లాంటి దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకలు ఈ మార్గం గుండానే వెళ్తాయి. ఉద్రిక్తతలు పెరగక ముందు, ప్రపంచవ్యాప్తంగా రోజూ సరఫరా అయ్యే క్రూడాయిల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)లో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరిగేది.
ఇక్కడ రవాణా ఆగితే చమురు సరఫరా ఆలస్యం కావడమే కాకుండా ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు అమాంతం పెరుగుతాయి. దీని ప్రభావం అంతర్జాతీయ చమురు ధరలపై పడుతుంది. అందుకే ఈ మార్గం తెరుచుకుంటుందన్న వార్త ప్రపంచ చమురు మార్కెట్‌లో ఆసక్తి రేపుతోంది.
క్రూడాయిల్ ధరలు ఇప్పటికే తగ్గాయా?
హార్ముజ్ మార్గాన్ని తెరిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 22న బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ మార్గం మళ్లీ తెరుచుకుంటే చమురు సరఫరాకు ఢోకా ఉండదన్న అంచనాలే ఈ ధరల తగ్గింపునకు కారణం.
అయితే కేవలం ఒక్క వార్తతోనే ధరలు శాశ్వతంగా తగ్గాయని చెప్పలేం. మిడిల్ ఈస్ట్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాలు, మార్కెట్ అంచనాలు లాంటి ఎన్నో అంశాలు క్రూడాయిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒక్కరోజు తగ్గిన ధరను చూసి మురిసిపోలేం.
సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ చమురు మార్గాలు
హార్ముజ్ జలసంధి సమస్యల నేపథ్యంలో, సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలపై దృష్టి పెట్టింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రంలోని యన్బు పోర్టుకు చమురును తరలించే 'ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్'ను సౌదీ చురుగ్గా వాడుకుంటోంది. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రపంచ మార్కెట్‌కు చమురు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు.
అయితే హార్ముజ్ ద్వారా జరిగే భారీ వాణిజ్యాన్ని ఇవి పూర్తిగా భర్తీ చేయలేవు. నౌకల భద్రత, ఎగుమతుల పరిమాణం, పోర్టుల సామర్థ్యం ఇక్కడ చాలా కీలకం. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ హార్ముజ్ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదు.
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గుతాయా?
మన దేశంలోని వాహనదారులు ఎదురుచూస్తున్న అసలు ప్రశ్న ఇదే. హార్ముజ్ మార్గం పూర్తిగా తెరుచుకుని, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గితే, మన దగ్గర కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశం ముడి చమురు కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.
అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తగ్గిన ప్రతిసారీ ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు అదే స్థాయిలో తగ్గవు. డాలర్‌తో రూపాయి మారకం విలువ, రిఫైనరీ ఖర్చులు, రవాణా ఛార్జీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ఆయిల్ కంపెనీల నిర్ణయాలు.. ఇవన్నీ ధరలను నిర్ణయిస్తాయి.
కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.15 తగ్గుతుందన్న వార్తలను ఇప్పుడే పూర్తిగా నమ్మలేం. ఆ స్థాయిలో ధరలు తగ్గాలంటే మార్కెట్ పరిస్థితులు అనుకూలించాలి, ఆయిల్ కంపెనీలు అధికారికంగా నిర్ణయం తీసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూసి తొందరపడకండి.
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే అంతర్జాతీయ ధరలతో పాటు స్థానిక పన్నులు, ఇతర ఖర్చులు కూడా అనుకూలించాలి. కాబట్టి, 'లీటర్‌కు రూ.15 తగ్గుతుంది' అనేది కేవలం మార్కెట్ అంచనా మాత్రమే తప్ప, అధికారిక ప్రకటన కాదు.
రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ చర్చలు, హార్ముజ్ మార్గంలో భద్రత, ఆయిల్ కంపెనీల నిర్ణయాలే మన ఇంధన ధరలను శాసిస్తాయి. మార్గం తెరుచుకుని సరఫరా మెరుగుపడితేనే సామాన్యులకు ఊరట లభించవచ్చు.
మొత్తానికి పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గుతాయన్న వార్త అందరిలో ఆసక్తి రేపింది. కానీ హార్ముజ్ మార్గంపై వస్తున్న విరుద్ధమైన వార్తలు, మన దేశంలో ధరలను నిర్ణయించే అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ వార్తలను అర్థం చేసుకోవాలి. ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్ పరిణామాలే మనకు అసలైన లాభం చేకూరుస్తాయా లేదా అనేది తేలుస్తాయి.
అమెరికా-ఇరాన్ చర్చల్లో తదుపరి అడుగు ఏంటి?
హార్ముజ్ జలసంధి వ్యవహారంలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ 16న ఇరాన్ తన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపింది. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలను దౌత్యపరమైన చర్చలకు ప్లాట్ ఫామ్ గా వాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది.
మరోవైపు ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు కొనసాగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు ఉన్నందున, ఈ చర్చలు ఎంతవరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.

