- Home
- Automobile
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ మైలేజ్... ప్రధాని మోదీ లాంచ్ చేసిన స్పెషల్ కారు ఫీచర్లివే
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ మైలేజ్... ప్రధాని మోదీ లాంచ్ చేసిన స్పెషల్ కారు ఫీచర్లివే
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేశారు. మరి ఆ కారు ఏది? దాని ఫీచర్లేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధాని మోదీ చేతులమీదుగా మారుతి కారు లాంచ్
Maruti Suzuki e Vitara : మారుతి సుజుకి తయారుచేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'మారుతి ఇ విటారా'ని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. మారుతి సుజుకి ప్లాంట్‌లో ఇ విటారా తయారీ కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ లైన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. ప్రస్తుతం సొంతరాష్ట్రం గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ ఈ మారుతి ప్లాంట్ ను సందర్శించి కంపెనీ మొట్టమొదటి EV కారును లాంచ్ చేశారు.
ఈ ఎలక్ట్రిక్ SUV ని స్థానిక వినియోగానికే కాదు ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. 2026 ఆర్థిక సంవత్సరానికి 67,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఎక్కువ భాగాన్ని ఎగుమతి చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో తయారైన ఉత్పత్తుల స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
Hon’ble @PMOIndia Shri @narendramodi today commemorated two historic firsts: Start of Production of Maruti Suzuki’s first Battery Electric Vehicle, e VITARA, for sales in over 100 countries, at Suzuki Motor Gujarat Private Limited, a wholly owned subsidiary of #MarutiSuzuki and… pic.twitter.com/BLTYPEhZvB
— Maruti Suzuki (@Maruti_Corp) August 26, 2025
మాారుతి సుజుకి లక్ష్యమిదే..
హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్ గుజరాత్ (SMG) ప్లాంట్ 640 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 7.5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది. ఈ కొత్త అసెంబ్లీ లైన్ ప్రారంభించిన తర్వాత సామర్థ్యం మరింత పెరుగుతుంది. మూడు ఉత్పత్తి లైన్లు ఉన్న ఈ ప్లాంట్‌ను ఇటీవల సుజుకి మోటార్ కార్పొరేషన్ నుండి మారుతి సుజుకి స్వాధీనం చేసుకుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రణాళికను కూడా మారుతి సుజుకి ప్రకటించింది.
హన్సల్ పూర్ లో మారుతి ప్లాంట్ ప్రత్యేకతలివే..
దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను తీర్చడానికి 2014 మార్చిలో హన్సల్‌పూర్ ప్లాంట్ ప్రారంభించారు. మారుతి సుజుకి బాలెనోను ఇక్కడ మొదట తయారు చేశారు. ఆ తర్వాత 2018 జనవరిలో తదుపరి తరం మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పుడు మారుతి తయారుచేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ విటారాను కూడా ఇక్కడ నుండి ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేస్తారు. ముంద్రా ఓడరేవుకు సమీపంలో ఉన్న ఈ ప్లాంట్ నుండి ఇప్పటివరకు యూరప్, ఆఫ్రికా, జపాన్ వంటి దేశాలకు వాహనాలను ఎగుమతి చేశారు.
ఈ న్యూ మారుతి సుజుకి ఇ విటారా స్పెషల్ ఫీచర్లివే
మారుతి ఇ విటారా గురించి చెప్పాలంటే 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది. మారుతి ఇ విటారా 4,275 మిల్లీమీటర్ల పొడవు, 1,800 మిల్లీమీటర్ల వెడల్పు, 1,635 మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంది. క్రెటా కంటే ఎక్కువ పొడవున్న 2,700 మిల్లీమీటర్ల వీల్‌బేస్ ఇ విటారాకు లభిస్తుంది. కారు లోపల మంచి బ్యాటరీ ప్యాక్‌ను అమర్చడానికి ఈ పెద్ద వీల్‌బేస్ సహాయపడుతుంది. భారతీయ రోడ్డు పరిస్థితులకు సరిపోయే 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి దీని మొత్తం బరువు 1,702 కిలోగ్రాముల నుండి 1,899 కిలోగ్రాముల వరకు ఉంటుంది.
ఇ విటారా ఈవి మైలేజ్ ఎంతో తెలుసా?
మారుతి ఇ విటారాలో లిథియం ఐరన్-ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ ఉంది. రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లను (49kWh, 61kWh) ఉపయోగించి కంపెనీ ఈ SUVని అందిస్తోంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌లో డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఉంది. దీన్ని కంపెనీ ఆల్ గ్రిప్-ఇ అని పిలుస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.
ఇ విటారా పోటీ వీటితోనే..
మారుతి ఇ విటారాకు ప్రధాన ప్రత్యర్థి హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్. దీనితో పాటు టాటా నెక్సాన్ EV, MG విండ్‌సర్ వంటి కార్లతో కూడా మారుతి ఇ విటారా పోటీ పడుతుంది.