ఆటోమొబైల్ పరిశ్రమని వదలని కరోనా: ఇండియాలో 8 సంవత్సరాల కనిష్టానికి వాహనాల రిజిస్ట్రేషన్లు..
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఆటోమొబైల్ పరిశ్రమను కూడా ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడిఏ ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.
ఎఫ్‌ఏడిఏ ప్రకారం గత ఎనిమిది సంవత్సరాలలో భారతదేశంలో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 29.85 శాతం క్షీణించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,17,68,502 యూనిట్లతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,52,71,519 యూనిట్లకు పడిపోయింది.
ట్రాక్టర్ మినహా అన్ని విభాగాలలో క్షీణత
ట్రాక్టర్ మినహా అన్ని క్యాటగిరిలో రిజిస్ట్రేషన్లు గత ఆర్థిక సంవత్సరంలో క్షీణించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో 31.51 శాతం, త్రీ వీలర్ల విభాగం 64.12 శాతం, వాణిజ్య వాహనాలు, ప్రయాణీకుల వాహనాల విభాగంలో 13.96 శాతం క్షీణించాయి. ఈ గణాంకాలన్నీ ఆర్ధిక సంవత్సరం 2013 స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
అయితే 16.11 శాతం వృద్ధితో రిజిస్ట్రేషన్లు చేసిన ఏకైక క్యాటగిరి ట్రాక్టర్. 20-21 ఆర్థిక సంవత్సరంలో 6,44,779 ట్రాక్టర్లు రిజిస్టర్ కాగా, అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5,55,315 ట్రాక్టర్లు రిజిస్టర్ అయ్యాయి.
ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే గత ఆర్థిక సంవత్సరంలో 27,73,514 యూనిట్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 23,86,316 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. ద్విచక్ర వాహన విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో 1,68,38,965 యూనిట్లు నమోదు కాగా, ఈసారి 1,15,33,336 యూనిట్ల ద్విచక్ర వాహనాలను నమోదు అయ్యాయి. గత ఆర్ధిక సంవత్సరంలో 7,19,594 యూనిట్లతో పోల్చితే ఈ సారి త్రీ వీలర్లు 2,58,174 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల గురించి మాట్లాడితే, గత ఆర్థిక సంవత్సరంలో 8,81,114 యూనిట్లతో పోలిస్తే ఈసారి 4,48,914 యూనిట్లు నమోదయ్యాయి.
ఏప్రిల్ 2021లో పడిపోయిన రిజిస్ట్రేషన్లు
మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో వాహనాల నెలవారీ రిజిస్ట్రేషన్స్ 28.15 శాతం క్షీణించింది. మార్చిలో 16,49,678 యూనిట్లు రిజిస్టర్ కాగా, ఏప్రిల్ నెలలో 11,85,374 యూనిట్లు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లో దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించినందున ఒక్క వాహనాన్ని కూడా అమ్మకాలు జరగలేదని ఫడా పేర్కొన్నందున ఏప్రిల్ 2021 ను ఏప్రిల్ 2020తో పోల్చడం లేదు.
ఈ కాలంలో ట్రాక్టర్ విభాగంలో అతిపెద్ద క్షీణత నమోదైంది. మార్చి 2021లో 69,082 ట్రాక్టర్లు రిజిస్టర్ కాగా, ఏప్రిల్ 2021లో 38,285 కు తగ్గింది. అంటే ట్రాక్టర్ విభాగం 44.58 శాతం కోల్పోయింది. అదే విధంగా ద్విచక్ర వాహన విభాగంలో 27.63 శాతం, త్రీ వీలర్ విభాగంలో 43.11 శాతం, ప్రయాణీకుల వాహన విభాగంలో 25.33 శాతం, వాణిజ్య వాహనాల విభాగంలో 23.65 శాతం క్షీణత నమోదైంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆటోమొబైల్ రంగం రిజిస్ట్రేషన్లలో రెండంకెల క్షీణతను చూసింది, ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఈ నెల ప్రారంభం నుండి పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. ఫాడా అధ్యక్షుడు వింకేష్ గులాటి మాట్లాడుతూ, "గత సంవత్సరానికి భిన్నంగా, ఈసారి లాక్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. ఈ కారణంగా కేంద్రం లేదా ఆర్‌బిఐ, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారు (ఓఇఎమ్) ఇప్పటివరకు ఎటువంటి ఉపశమన ప్రకటనలు చేయలేదు. " అని అన్నారు.